ఎన్నికల్లో లబ్దికోసం

– కృష్ణాజలాలపై వడివడి అడుగులు
– తొమ్మిదేండ్లుగా పట్టించుకోని మోడీ సర్కారు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కృష్ణా జలాల పున:పంపిణీపై కేంద్రం వేగం పెంచింది. ఎన్నికల తరుణంలో రెండు రోజుల క్రితమే కృష్ణాజలాల పంపిణీ అంశాన్ని బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు అప్పగించిన మోడీ సర్కారు, మరో ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను తోసిరాజంటూ వెంటనే పున:పంపిణీకి చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ శుక్రవారం రాత్రి హడావిడిగా నోటిఫికేషన్‌ జారీచేయడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేటాయించిన 811 టీఎంసీలు, అదనపు జలాలు, పోలవరం ద్వారా కృష్ణాకు తరలించే నీటిని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ట్రిబ్యునల్‌కు కేంద్రం ప్రతిపాదించింది. కాగా ఏపీ సీఎం జగన్‌ చేసిన ఫిర్యాదును కేంద్రం పట్టించుకోకుండా పంపిణీని వేగవంతం చేయాలని బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఆదేశిస్తూ గెజిట్‌ జారీ చేయడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమవుతున్నది. కాగా తెలంగాణ ఆవిర్భావం తొలినాళ్లల్లో సీఎం కేసీఆర్‌ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్నట్టు రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా పట్టించుకోని కేంద్రం, త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉండటం, వచ్చే సంవత్సరంలో ఏపీలోనూ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వడివడిగా అడుగులు వేస్తున్నది. పునర్విభజన చట్టం పరిధిలో ఇప్పటిదాకా పెండింగ్‌లో పెట్టిన ఫైళ్ల దుమ్ము దులుపుతున్నది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల నేపథ్యంలో కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సైతం తాగునీటి కేటాయింపుల కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు ఇస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కృష్ణా జలాల పున:పంపిణీ కోసం కేంద్రం పంపిన పలు ప్రతిపాదనలు ట్రిబ్యునల్‌ పరిశీలించనుంది. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు, నీటి లభ్యత, పంపిణీ అంశంపై దృష్టిపెట్టనుంది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపులను కూడా పరిశీలించి రెండు రాష్ట్రాలకు పున:పంపిణీ చేయాల్సి ఉంటుంది. రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో కేంద్రం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఎన్నికలేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమే ప్రధాన ఎజెండాగా కేంద్ర జలశక్తి శాఖ పావులు కదుపుతున్నది. ఇందుకోసం బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌పై ఒత్తిడి పెంచి వేగంగా చర్యలు తీసుకోవాలంటూ మార్గదర్శకాలు జారీచేసింది.