చర్మ సంరక్షణకు…

For skin care...చలి కాలం ప్రారంభమైంది. వాతావరణానికి తగ్గట్లు చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఆరోగ్య సంరక్షణతో పాటు చర్మ సంరక్షణ కూడా చాలా ముఖ్యమైనది. చర్మం ఆరోగ్యంగా లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల చర్మాన్ని సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు విధిగా పాటించాలి.

నీళ్లు తాగండి : చర్మానికి ఔషధంలా పనిచేసేది స్వచ్ఛమైన నీరు. అందుకే మీరు డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యమైన విధిగా గుర్తుంచుకోండి. డీహైడ్రేషన్‌ బారిన పడితే రాను రాను మీ చర్మం మందంగా మారి, త్వరగా ముడతలు పడిపోతుంది. ఒంట్లో తేమ శాతం తగ్గకుండా చేయడం చర్మానికి చాలా అవసరం. నున్నని, సున్నితమైన చర్మం కోసం నీళ్లు బాగా తాగాలి. ఇలా చేస్తే మొటిమల సమస్య కూడా తగ్గుతుంది.
స్కిన్‌ టైప్‌ : చర్మ సంరక్షణలో మొదటి మెట్టు మీ చర్మం ఏ రకమైనదో తెలుసుకోవడంతోనే మొదలవుతుంది. చర్మం ఏ రకం అనే దాన్ని బట్టే ఉత్పత్తులు వాడాలి. డ్రై స్కిన్‌, ఆయిలీ స్కిన్‌, కాంబినేషన్‌ స్కిన్‌ అనే విషయం తేలితే దాన్ని బట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకు మీది బాగా పొడిబారిన చర్మం అనుకోండి హైడ్రేషన్‌ పై పూర్తి ఫోకస్‌ పెట్టడం అత్యంత ముఖ్యమైన విషయం. లేదంటే మీకు వృద్ధాప్య లక్షణాలు అతి చిన్న వయసులోనే వచ్చేస్తాయి.
స్క్రబ్‌ : చర్మం పైపొర పొలుసులుగా ఊడిపోతూనే ఉంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. చర్మం పై పొర పొడిపొడిగా రాలడం, చర్మంపై అక్కడక్కడా తెల్లగా కనిపించడం వంటివన్నీ దీంతోనే వస్తాయి. దీనికి విరుగుడు మంచి స్క్రబ్‌ను ఉపయోగించడమే. రక్త ప్రసరణ మెరుగు పరిచి, చర్మానికి నిగారింపు తెచ్చే స్క్రబ్బింగ్‌ను రెగ్యులర్‌ గా చేయండి. ఇందుకు పార్లర్‌కు వెళ్లాల్సిన పని లేదు. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు.
ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ : మీరేం తింటారన్న ఆహారంలోనే మీ చర్మం ఆరోగ్యం, అందం దాగి ఉంది. నీరు ఎక్కువ శాతం ఉన్న కర్బూజ, పుచ్చకాయ, దోసకాయ వంటివి తింటే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు వేపుళ్లు, పచ్చళ్లు వంటివి ఎక్కువగా తినకుండా ఉడికించిన ఆహారం, ఆవిరి మీద ఉడికించిన ఆహారాన్ని ఎక్కువగా తింటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉన్న బెర్రీలు, ద్రాక్ష, నట్స్‌ వంటివి మీ చర్మ కణాలు డ్యామేజ్‌ కాకుండా సహజసిద్ధంగా మెరుపును సంతరించుకునేలా చేస్తాయి.