– డాలర్ ఏ 85.27
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ వరుస పతనం కొనసాగుతోంది. గురువారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 85.27 కనిష్ట స్థాయికి దిగజారి.. భారత కరెన్సీ చరిత్రలోనే అత్యంత కనిష్టానికి పడిపోవడం గమనార్హం. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో రూపాయి విలువ 85.23 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 85.28 కనిష్ట స్థాయిని తాకి.. తుదకు 85.27 స్థాయిలో ముగిసింది. డిసెంబర్ నెల చివరి రోజులు కావడంతో ఫారెక్స్ ట్రేడర్లు తమ చెల్లింపుల డిమాండ్‌ను చేరుకోవడానికి డాలర్ల కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఇప్పటికే డాలర్‌కు పెరిగిన డిమాండ్‌ను మరింత పెంచుతోంది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అత్యంత బలహీనమైన గణంకాలు, స్టాక్ మార్కెట్ల వరుస పతనం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోవడం, పేలవ
ఎగుమతుల తీరు, దిగుమతులు పెరగడం తదితర అంశాలు రూపాయి విలువను బక్కచిక్కేలా చేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఇప్పటికే వాహన కంపెనీలు ధరలు పెంచడాన్ని ప్రారంభించాయి. ఇదే బాటలో ఎలక్ట్రానిక్స్, చమురు, బంగారం, ఇతర దిగుమతి ఉత్పత్తులు భారం కానున్నాయి.