మాయ మాటల ప్రభుత్వాలను నమ్మొద్దు: మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి

నవతెలంగాణ- నవీపేట్: కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ మాయమాటల ప్రభుత్వాలను మూడోసారి నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని పార్టీ అధ్యక్షులు సుధాకర్ రావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు పర్యాయాలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మాయ మాటలతో నమ్మించి మోసం చేశారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం ఇప్పటికీ ప్రజల మదిలో ఉందని అన్నారు  కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటల ప్రభుత్వం కాబోదని చేతల ప్రభుత్వంగా తమ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి పేద ప్రజల సంక్షేమాన్ని కాపాడాలని అన్నారు. అనంతరం కాంగ్రెస్ మండల  కిసాన్ అధ్యక్షులుగా నిజాంపూర్ ఉపసర్పంచ్ సురకత్తుల పెద్దన్నకు నియామక పత్రాన్ని అందించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో పలువురు కండువా కప్పుకుని చేరారు. ఈ కార్యక్రమంలో తాహెర్ బిన్ హందాన్, శరత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.