‘నాలుగు అడుగులు’ గురించి నాలుగు మాటలు

కథకులు కృష్ణమూర్తి వంజారి మధ్యతరగతి జీవితాలు ఔపోసన పట్టారు. ‘నాకు తెలిసింది నటన, తెలియంది సాహిత్యం’ అంటూనే ఎంతో తెలియచెప్పారు. కథల్లో చిత్రీకరించిన పాత్రలు కళ్లెదుట కదలాడుతాయి. వారు ఎదుర్కొంటున్న మధ్యతరగతి జీవితాలలోని అనిశ్చిత్తి, అసౌకర్యం, ఆవేదనని మన గుండెలు చెదిరిపోయేలా చెప్పి, చివరకు ఆశావహ దృక్పధాన్ని ప్రకటిస్తూ ముగుస్తాయి. పరాయి ఊళ్లో పది రూపాయలు టీ కి ఖర్చు పెట్టడానికి సంశయించే శ్రీనివాసరావు జేబులో చివరకు 10 వేల రూపాయలుంటాయి. ‘మనిషెక్కడో లేడు…’ అంటూనే మనలోనే వున్నాడంటూ చెబుతారు రచయిత. పిండిమర ఆడించటం తప్ప మరోటి తెలియని రాఘవయ్య వుద్యోగం ఉడినా, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ మూర్తి ఆదుకుంటాడు. అంత్యక్రియలూ చేస్తాడు. తండ్రి అద్దీకం తృప్తిగా చేసినట్లు ‘ఫీల్‌’ అవుతాడు. క్లాసులో మార్కులు తక్కువ తెచ్చుకున్నా, జీవితం అనే బడిలో శ్రీనుదే ఫస్ట్‌ ర్యాంకు. రైలు ప్రయాణమే కావొచ్చు (మనిషెక్కడో లేడు), మహాలక్ష్మమ్మ గుడి ఎదుట అడుక్కునే తులసమ్మే కావొచ్చు (నేనేం చేసుకుంటాను), అత్తారింటి కూతురు పద్మ జీవితమే కావొచ్చు (ఒక్కసారి ఆలోచిద్దాం!)… వీరందరూ ఎదుర్కొన్న సమస్యలు అతి సామాన్యం. కానీ రచయిత మన ఎదుట వుంచిన తీరు అసామాన్యం! సామాన్యమైన శిలలోంచి శిల్పాన్ని మలచిన తీరుకు కృష్ణమూర్తి వంజారికి ‘హాట్సాఫ్‌’ చెప్పాల్సిందే. ‘ముప్పావు కడుపుకు తిను… పావు కడుపుకు ఎవరికైనా పెట్టు (పేజీ 25)’, ‘మన సమాజంలో కన్యూమర్స్‌ వున్నారు. కంట్రిబ్యూటర్స్‌ లేరు (పేజీ 36)’, ‘చెట్టు ఇచ్చే చల్లదనం ఎండ వున్నంత సేపే. మంచితనంలో మనిషి జీవితాంతం సేదతీరుతాడు (పేజీ 62) లాంటి మంచి వాక్యాలు, ‘అది చాలు మనకు’, ‘ఒక్కసారి ఆలోచిద్దాం’, ‘తాకిడికి తట్టుకోలేక’ లాంటి కథా శీర్షికలు రచయితకు కథ చెప్పడంలోని పట్టు, నైపుణ్యం తెలుపుతాయి.
– కూర చిదంబంరం, 8639338675