బ్రిక్స్‌లో చేరేందుకు ఫ్రాన్స్‌ ఆసక్తి

జోహాన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికాలో ఆగస్టులో జరగనున్న బ్రిక్స్‌ దేశాల సదస్సుకు తమను ఆహ్వానించాలని కోరినట్టు ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి కాథరైన్‌ కొలోన్నా ప్రకటించారు. ఫ్రాన్స్‌కు ఆహ్వానం అందితే అది బ్రిక్స్‌ సదస్సుకు హాజరవుతున్న మొట్ట మొద టి జి-7 దేశం అవుతుంది. బ్రిక్స్‌ సదస్సులో ఒక పరిశీలకుడిగా హాజర య్యేందుకు ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుల్‌ మక్రాన్‌ ఆసక్తి చూపుతున్నారని తాను దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి తెలిపినట్టు కొలోన్నా తెలిపారు. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో స్థాపించిన బ్రిక్స్‌ దేశాల 15వ సదస్సు జోహాన్నెస్‌బర్గ్‌లో ఆగస్టు 22 నుంచి 24వరకు జరగనుంది. ఈ మధ్యకాలంలో ఫ్రాన్స్‌కు బ్రిక్స్‌ సభ్య దేశమైన రష్యాతో సంబంధాలు క్షీణించాయి. ఆఫ్రికాలో ఫ్రాన్స్‌ పలుకుబడి క్షీణించటానికి రష్యా దష్ప్రచా రమే కారణమని ఫ్రాన్స్‌ భావిస్తోంది. ఒకవైపు ఉక్రెయిన్‌కు భారీ ఆయుధా లను సరఫరా చేస్తూ, మరోవైపు ఉక్రెయిన్‌ యుద్ధ విరమణకు మధ్యవర్తి పాత్రను పోషించటానికి మక్రాన్‌ సంసిద్ధతను తెలిపారు. అయితే మక్రాన్‌ మద్దతిస్తున్న ఉక్రెయిన్‌ శాంతి ప్రణాళికను రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బ్రిక్స్‌ సదస్సులో ఫ్రాన్స్‌ పాల్గొనటం ఆసక్తికర పరి ణామమని, అది ప్రపంచంలో బ్రిక్స్‌ విస్తరణను పెంచుతుందని దక్షిణాఫ్రికా విదేశాంగమంత్రి పన్దోర్‌ వ్యాఖ్యానించారు. అయితే ఫ్రాన్స్‌ కోరికను మన్నించటం బ్రిక్స్‌ వర్తమాన అధ్యక్షుడిగావున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా నిర్ణయంపైన ఆధారపడి వుంటుందని ఆమె అన్నారు.