ఆప్‌తోనే ఉచిత విద్య, వైద్యం

– తెలంగాణలోనూ ఢిల్లీ మోడల్‌
– 24న సామాన్యుడి సమరభేరీ :డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత విద్య, వైద్యమందిస్తామనీ, తెలంగాణలోనూ ఢిల్లీ తరహా పాలనను తీసుకొస్తామని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సెప్టెంబర్‌ 24న హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న సామాన్యుడి సమరభేరీ సదస్సు పోస్టర్‌ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ సదస్సుకు ఆప్‌ దక్షిణ భారత ఇన్‌ ఛార్జి సోమనాథ్‌ భారతి హాజరవుతారనీ, 33 జిల్లాల నుంచి జిల్లా కన్వీనర్లు, మండల, గ్రామ కన్వీనర్లు పాల్గొంటారని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ కష్టాలు, విద్య, ఆరోగ్యం, అవినీతి, పేపర్‌ లీకేజీలతో సహా పలు కీలక సమస్యలను చర్చించనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, బీజేపీ విభజన రాజకీయాలు, బీఆర్‌ఎస్‌ అవినీతి రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎడ్యుకేషన్‌, వన్‌ హెల్త్‌కేర్‌ వంటి ఆప్‌ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. మెరుగైన జీవితం అందించగల పార్టీ ఆప్‌ అని గుర్తించిన ప్రజలు వివిధ రాష్ట్రాల్లో అద్భుతమైన విజయాలు అందిస్తున్నారనీ, అదే విధంగా తెలంగాణలోనూ ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్‌ అధికార ప్రతినిధి వినరు రెడ్డి, సోషల్‌ మీడియా కన్వీనర్‌ సోహెల్‌, నేతలు టి. రాకేష్‌ సింగ్‌, జావేద్‌ షరీఫ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, ముత్తాహేయిడ్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ తదితరులు పాల్గొన్నారు.