– ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-షాద్ నగర్
ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంతో పాటు పలు చోట్ల జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం వీరులు చేసిన త్యాగాన్ని ఎన్నటికీ మరువలేమని అందుకే ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవాల్లో వారి త్యాగాలను స్మరించుకుంటున్నామని అన్నారు. సమాజంలో కులాలకు, మతాలకు అతీతంగా కలిసివచ్చి సామరస్యంగా ప్రజలందరూ మెలిగిన నాడే సంపూర్ణమైన అభివృద్ధి సహకారం అవుతుందని అన్నారు. ప్రతి మనిషిలో కష్టపడే తత్వం నిజాయితీ, త్యాగ గుణం ఉండాలని ఆకాంక్షించారు. వీటితోనే కుటుంబం గ్రామం రాష్ట్రం తద్వారా దేశం బాగుపడుతుందని అన్నారు. మానవసేవే మాధవ సేవ అన్న నానుడి పాటించి అందరిని సేవతో మెప్పించాలని అన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన స్వతంత్ర వేడుకల్లో ప్రజలకు పిలుపునిచ్చారు. అదే విధంగా అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని తెలిపారు. తలసరి ఆదాయంలో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంపదను పెంచి పేదలకు పంచుతున్నారని చెప్పారు. మహాత్మా గాంధీ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, సీఐ ప్రతాప్ లింగం, ఆర్డీఓ మాధవ రమణ, తహసీల్దార్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.