– వీరతెలంగాణా పోరాట యోధుడు మంచికంటి రాంకిషన్‌రావు
– పాలకుల ఆగ్రహాన్ని తట్టుకుని నిలబడిన ధీశాలి
పీడిత ప్రజల విముక్తి కోసం వీరతెలంగాణా సమరాంగణంలో కొదమ సింహంలా విజృంభించి, చివరికంటా ప్రజా ఉద్యమ నిర్మాణంలో ఆణిముత్యమై మెరిసిన వ్యక్తి మంచికంటి రాంకిషన్‌రావు. ప్రజాపోరాటాన్ని అణచడానికి ఆనాటి పాలకులు ఎందరో యోధులతోపాటు మంచికంటిని కూడా జైల్లో పెట్టారు. చింత్రహింసలకు గురిచేసినా మొక్కవోని దీక్షతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రజల మనిషిగా తన గొంతును వినిపించారు.
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
కృష్ణాజిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలులో రాంకిషన్‌రావు సాధారణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పర్సా రామానుజరావు. తల్లి సీతమ్మ. రాంకిషన్‌రావుకు ఐదారేండ్ల వయసున్నప్పుడే నాన్న చనిపోయారు. ఆయనకు ఓ అక్క, అన్న కూడా ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్లయ్యే వరకూ వ్యవసాయం చేసుకొని ఫలసాయం అప్పుల కింద జమ చేసుకునేలా ఉన్న కొద్దిపాటి పొలాన్ని అప్పల వాళ్లకు అప్పగించి ఆ కుటుం బం ఖమ్మం వచ్చింది. వీరి కుటుంబ విషయం తెలిసి కాచిరాజుగూడెం భూస్వామి, పట్వారి అయిన మంచికంటి తిరుమలరావు రాంకిషన్‌రావును దత్తత చేసుకున్నారు. అప్పటి నుంచి రాంకిషన్‌రావు.. మంచికంటిగా మారారు. కాచిరాజుగూడెంలో ఇంటి వద్దనే ఉంటూ మూడో తరగతి వరకూ పూర్తి చేశారు.
ఆ తరువాత పై చదువుల కోసం ఖమ్మంలో పెట్టారు. ఆరో తరగతిలో ఉండగానే రాంకిషన్‌రావుకు వివాహమైంది. ఆ తర్వాత రాంకిషన్‌రావు హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ కార్యాలయంలో చిన్న ఉద్యోగంలో చేరారు. తర్వాత షోలాపూర్ వెళ్లి సైన్యంలో చేరారు. ఆ సమయంలో ఆంధ్ర మహాసభలో పనిచేస్తున్న జాతీయవాది కొమరగిరి నారాయణరావు, భార్య, తండ్రి సూచన మేరకు సైన్యం శిబిరం(పూణా) నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. కొన్నేళ్లపాటు అజ్ఞాతవాసంలో గడిపారు.
జైల్లో చిత్రహింసలు
నైజాం సంస్థానానికి సరిహద్దునగల కృష్ణాజిల్లా కమ్మవారిపాలెం, మల్కాపురం గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మొదటి గెరిల్లా పోరాట శిక్షణ కేంద్రాలు ప్రారంభ మయ్యాయి. ఆయుధాల కోసం పోలీసుస్టేషన్లపై దళాల దాడులకు మంచికటి నేతృత్వం వహించారు. తన రాజకీయ జీవితంలో అనేకసార్లు జైల్లో గడిపారు. వరంగల్ జైల్లో రేయింబవళ్లు కాళ్లూ చేతులకు బేడీలు వేయబడి శిక్ష అనుభవించారు. 1964లో సీపీఐ(ఎం) వైపు వచ్చిన ఆయన ప్రభుత్వ ఆగ్రహానికిగురై 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉండగానే ఆయన జబ్బున పడ్డారు. 1974లో అధిక ధరలకు నిరసనగా నిర్వహించిన ఆందోళనలో మరో చిర్రావూరి లక్ష్మీనరసయ్యతో పాటు మంచికంటి అరెస్టయ్యారు.
వారి పోరాట పటిమను అణచడానికి ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వారిద్దరికీ బేడీలు వేయించి ఖమ్మం పురవీధుల్లో ఊరేగింపజేశారు. తర్వాత ఆ ఖమ్మం గడ్డపైనే చిర్రావూరి మున్సిపల్ చైర్మెన్‌గా, రాంకిషన్‌రావు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1975లో ఎమర్జెన్సీలో కూడా రాంకిషన్‌రావును రాజమండ్రి, హైదరాబాద్, వరంగల్ కేంద్ర కారాగారాల్లో నిర్బంధించారు. మళ్లీ ఆయనకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడటంతో వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో చేర్చారు. ఆ స్థితిలో కూడా ఆయనను గొలుసులతో మంచానికి కట్టేసి హింసించారు.
సీపీఐ(ఎం)లో రాంకిషన్‌రావు ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. 1982, 1985లో ఖమ్మం శాసనసభ్యునిగా ఎన్నికై శాసనసభలో ప్రజల వాణిని వినిపించారు. ఆ యోధుడు 1995 ఫిబ్రవరి 8వ తేదీన కన్నుమూశారు.
సుందరయ్య, మాకినేని, చండ్రతో పరిచయం..
కొణతమాత్మకూరులో ఉన్నప్పుడు కమ్యూనిస్టు అగ్రనేతలు పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వర రావుతో మంచికంటి పరిచయం పెంచుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా చేరారు. ఇదే ఆయన రాజకీయ జీవితానికి ఆరంభం. నిజాం నవాబుకు చెందిన రజాకార్లు, భూస్వామ్య శక్తులు.. ప్రజలపై చేస్తున్న దాడులను తిప్పి కొట్టేందుకు ఆయన కృష్ణాజిల్లా కమ్మవారి పాలెంలో గెరిల్లా పోరాట యుద్ధ పద్ధతుల్లో శిక్షణ పొందారు. పిండిప్రోలులో దేశ్‌ముఖ్ జగన్నాధరెడ్డి దొర గడీని కూల్చివేసిన సంఘటనలో రాంకిషన్‌రావు పాల్గొన్నారు.