అర్థఫాసిజం నుండి పూర్తి ఫాసిజం వైపునకు…

నిజానికి ప్రభుత్వ వ్యతిరేకత, దేశ వ్యతిరేకత ఒకటి కాదు. ప్రభుత్వం మీదే కాదు, రాజ్యం మీద, రాజకీయ వ్యవస్థ మీద, ప్రస్తుతం సమాజంలో ఉన్న అనేక పెడధోరణుల మీద గొంతెత్తటం, అణగారిన ప్రజల్ని సమీకరించడం, పోరాటాలు నిర్మించడం ప్రజాతంత్ర వ్యవస్థలో అంతర్భాగం. కానీ దీన్నంతా తలక్రిందులు చేసి ప్రభుత్వాన్ని విమర్శించినా, వారి విధానాలను విమర్శించినా దేశద్రోహం క్రింద జమ గట్టి, రాజద్రోహం కింద కేసులు పెట్టే పరిస్థితికి ఈరోజు దేశం చేరింది. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకుంటూ తన ”మన్‌ కీ బాత్‌”లో దేశ ప్రధాని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది.
గత ఐదు దశాబ్దాల భారతదేశ రాజకీయ చరిత్ర నడక తీరు ఇది. నేడు దేశంలో హిందూత్వ శక్తులు అధికార పీఠంపై కూర్చున్నాయి. మతం పేరిట, మూఢవిశ్వాసాల పేరిట ఇతర మతాలపై విషప్రచారం సాగిస్తూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి మూలస్తంభాలైన లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమాఖ్య వ్యవస్థలపై కేంద్ర బీజేపీ పాశవికంగా దాడిచేస్తున్నది. చివరకు భారత రాజ్యాంగాన్ని చుట్టి పారేయడానికి, దాని స్థానంలో అత్యంత క్రూరమైన, అమానవీయమైన మనుధర్మ శాస్త్రాన్ని ప్రతిష్టించడానికి అర్రులు చాస్తున్నది. ఈ పరిస్థితి హఠాత్తుగా జరుగుతున్నది కాదు. ఈ నియంతృత్వానికి బీజాలు 48సంవత్సరాల క్రితం అనగా 1975 జూన్‌ 25 అర్థరాత్రి ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించినప్పుడే బీజాలు ప్రారంభమైంది. 1975 జూన్‌ 25 నుండి 1977 మార్చి వరకు దాదాపు 21 నెలలపాటు ఎమర్జెన్సీ బీభత్సకాండ సాగింది. రాష్ట్రాల హక్కుల మీద దాడి, నక్సలైట్లను, ఆ పేరిట మరెందరో రాజకీయ ఖైదీలను మట్టుపెట్టడం, ప్రజాస్వామ్య ఉద్యమాలపై పైశాచిక దాడులు, ప్రలోభాలు వెదజల్లి ఇతర రాజకీయ పార్టీల నుండి పార్టీలు మార్పించడం వంటివి ఎమర్జెన్సీ కాలంలో యధేచ్ఛగా సాగించారు. బెంగాల్‌, కేరళ, త్రిపుర వంటి రాష్ట్రాలలో వామపక్ష పార్టీల పైన, ఉధృతంగా సాగుతున్న భూపోరాటాలపైన కాంగ్రెస్‌ గుండాలు పోలీసుల అండదండలతో విరుచుకుపడ్డారు. 1974 రైల్వే కార్మికులు జరిపిన అపూర్వమైన అఖిల భారత సమ్మెను అత్యంత అమానుషంగా అణచివేశారు. వందలాది మంది కార్మిక నాయకులను ఉద్యోగాల నుండి తొలగించడం, జైళ్లల్లో కుక్కటం, కార్యాలయాలపై దాడులు నిర్వహించడం మనం చూశాం. అన్నింటికీ మించి వాక్‌ స్వాతంత్య్రం పైన, పత్రికా స్వేచ్ఛ పైన, మానవ హక్కుల పైన కనీవినీ ఎరుగని రీతిలో సాగిన అణచివేత అది. అందుకే ఆ కాలాన్ని (పాలనని) అర్థ ఫాసిస్ట్‌ అన్నారు.
ఎమర్జెన్సీ ముందు, తర్వాత
1971లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్‌ మూడింత రెండొంతులు మెజారిటీ సాధించింది. వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో కూడా విజయం సాధించింది. అయితే రాయబరేలిలో గెలుపు కోసం ఇందిరాగాంధీ అక్రమాలకు పాల్పడ్డారని ప్రత్యర్థి వేసిన పిటిషన్‌పై 1975లో జూన్‌ 12న అలహాబాద్‌ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఆమె ఎన్నిక చెల్లదని, ఆరు సంవత్సరాల పాటు ఆమె పోటీకి అనర్హురాలని సంచలనమైన తీర్పునిచ్చింది. నిజానికి సీపీఐ(ఎం) పార్టీ 1972లో జరిగిన తొమ్మిదవ మహాసభలో ”గణనీయమైన రాయితీలు చూపి జన సామాన్యంలోని పెద్ద భాగాన్ని సంతృప్తి పరిచేశక్తి కాంగ్రెస్‌కి లేకపోవడం, మరిన్ని భారాలు మోపటం, నిర్బంధ కాండను ప్రయోగించడం, వామపక్షాలు, ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటం, పాలకపార్టీ ప్రతిపక్షాలను సహించలేని స్థితిలో ఉండటం… ఇవన్నీ ఏక పార్టీ నియంతృత్వానికి దారితీసే ప్రమాదం ఉంది. అన్ని ప్రజాతంత్ర పార్టీల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఓటింగ్‌ హక్కుతో సహా కాంగ్రెస్‌ పాలనలో ఇక ఎంత మాత్రం సురక్షితంగా ఉండవు” అని హెచ్చరించింది. ఆ హెచ్చరిక మూడు సంవత్సరాల్లోనే వాస్తవ రూపం తీసుకుంది. ఓ పక్క అనేక పద్ధతుల ద్వారా కాంగ్రెస్‌ తన బలాన్ని నిరూపించుకుంటున్నా, మరో పక్క వర్గ పోరాటాలు వెల్లువెత్తాయి. స్వతంత్రం వచ్చిన 30సంవత్సరాలకే భారత పాలక వర్గాలైన బూర్జువా, భూస్వామ్య వర్గాల పాలన ఈ దేశాన్ని ముందుకు నడిపించలేదని, అలవిగాని సంక్షోభంలోకి దేశాన్ని నెడతాయని ఆ సందర్భంగా పాలకవర్గాలే తాము బాకాలూదుకునే సాధారణ ప్రజాస్వామ్యాన్ని కూడా సహించలేనిస్థితి దాపురించి, నిరంకుశత్వానికి తెరలేపుతాయని 1975లో నిరూపితమైంది. 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇందిరాగాంధీ, ఆమె ముద్దుల కొడుకు సంజరుగాంధీతో సహా కాంగ్రెస్‌ అధినాయకు లంతా మట్టికరిచారు. కాంగ్రెసేతర బూర్జువా పార్టీలు సంకలు గుద్దుకున్నాయి.
1978లో జరిగిన సీపీఐ(ఎం) పదవ మహాసభ ”ఎన్నికలలో కాంగ్రెస్‌ పరాభవం సంభవించినా నియంతృత్వానికి అనుకూల వాతావరణ సృష్టించే వర్గాల పరాజయానికి ఇది దారితీయలేదు. అందువల్ల బాహాటంగా నియంతృత్వాన్ని రుద్దటానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఇంకా కొనసాగించాల్సి ఉంది” అని ప్రజానీకానికి హెచ్చరించింది. ఈ నాలుగు దశాబ్దాలపైన పరిస్థితి సీపీఐ(ఎం) చేసిన హెచ్చరికకు అద్దం పడుతున్నది. కాంగ్రెస్‌ని ఓడించి అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం తన వర్గస్వభావ రీత్యా ఎమర్జెన్సీ సృష్టించిన నియంతృత్వ పోకడలను, వాటిని చట్టబద్ధం చేయడానికి తెచ్చిన 42వ రాజ్యాంగ సవరణను రద్దు చేయడానికి పూనుకోలేదు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని అందుకు జనతా ప్రభుత్వం ముందుకు తెచ్చిన 45వ సవరణ బిల్లును ఆమోదించలేక చాలా నెలలపాటు చర్చలతో కాలం వెళ్ళబుచ్చారు. అంతేకాదు కాంగ్రెస్‌ ప్రతిపాదించిన అనేక ప్రతీఘాత అంశాలను అందులో చొప్పించారు. అందులో ముఖ్యమైనది, అత్యవసర పరిస్థితిని ప్రకటించుకునే హక్కు, నిర్బంధించే హక్కు పొందుపరిచారు. దీంతో ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా పాలకవర్గాలు ఎంత క్రూరమైన చర్యలకు పాల్పడతాయో మనకి అర్థమవుతుంది. జనతా పార్టీ ప్రభుత్వం ఈ ప్రధాన వైఫల్యం, ముఖ్యంగా ఈ నియంతృత్వ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య కాంక్షతో ఉద్య మాల్లోకి వచ్చిన కోటానుకోట్ల మంది జనం ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించడం వలన 1980లో జరిగిన ఎన్నికల్లో జనతా ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి జనతా ప్రభుత్వం కూలిపోవడంలో, జనతా పార్టీ విచ్ఛిన్నం అవటంలో మరో ప్రధాన కారణం ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వాన్ని వదులుకోమని తెగేసి చెప్పిన వాజ్‌పాయి, అద్వానీ వంటి ప్రముఖ హిందుత్వ నాయకుల పాత్ర ఉంది. జనతా విచ్ఛిన్నం తర్వాతే ఈ నాయకుల ఆధ్వర్యంలో 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది.
నిరంకుశత్వం, నియంతృత్వం సాధారణీకరించబడ్డాయి
జనతా పార్టీని కూల్చి బయటికి వచ్చిన హిందుత్వ శక్తుల పార్టీ బీజేపీ. ఎమర్జెన్సీ కాలాన్ని, ముఖ్యంగా ఇందిరాగాంధీని తిట్టిపోస్తారు తప్ప, నిరంకుశ పోకడలకు, అందుకు రాజ్యాంగాన్ని సైతం తారుమారు చేయడంలో వారెన్నడు నోరుమెదపరు. ఇప్పుడు ఆ పార్టీ అత్యధిక మెజారిటీతో కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చింది. వచ్చింది మొదలు ప్రజాతంత్ర హక్కులపైన, రాజ్యాంగ విలువల పైన దాడి ప్రారంభించింది. అందుకు సిబిఐ, ఈడి, ఎన్నికల కమిషన్‌ చివరకు ఆర్బీఐ, సైన్యం, న్యాయస్థానాలు వంటి ఏ వ్యవస్థను వదలకుండా అన్నింటినీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఈరోజు దేశంలో అనేకమంది మానవ హక్కుల మేధావులు, రచయితలు, దళిత గిరిజన హక్కుల కోసం పోరాడే సామాజిక కార్యకర్తలు ‘ఊపా’ చట్టం కింద జైళ్లలో మగ్గుతున్నారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు 2022లో దేశంలో సాగుతున్న రాజద్రోహం కేసులను నిలిపివేయాలని, ప్రభుత్వం దీనిపై ఒక సమగ్ర సమీక్ష జరపాలని ఆదేశించింది. తాజాగా లా కమిషన్‌ తన 279వ నివేదికను విడుదల చేసింది. భారత క్రిమినల్‌ చట్టంలోని సెక్షన్‌ 124ఏని కమిషన్‌ పునఃసమీక్షించింది. అత్యంత ప్రమాదకరమైన ప్రతిపాదనలు చేసింది. ఈ సెక్షన్‌ క్రింద నిర్బంధించిన వారు కనీస కాలపరిమితి మూడు నుండి ఏడు సంవత్సరాలకు పెంచింది. అలాగే ఈ సెక్షన్‌ కిందకు వ్యక్తుల రాతలు, ఉపన్యాసాలు, ప్రకటనలు ఉన్నాయా లేదా అని నిర్థారించే ప్రాథమిక హక్కు పోలీస్‌ వారికి అప్పగించింది. అలాగే హింసను ప్రేరేపించడానికి అనుకూలంగా ఉండటం కూడా ఈ సెక్షన్‌ పరిధిలోకి తేవాలని లా కమిషన్‌ ప్రతిపాదించింది. ఈ 124ఏ సెక్షన్‌ అనేది 1870లో స్వాతంత్ర పోరాటయోధుల్ని అణచివేయడానికి బ్రిటిష్‌ వలస పాలకులు తెచ్చిన చట్టం. బాల గంగాధర తిలక్‌ ఛత్రపతి శివాజీని ప్రశంసిస్తూ రాసిన సంపాదకీయాలు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా భారతీయుల తిరుగుబాటుకు కారణమయ్యాయని ఆయనను బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్బంధించింది. అంటే ఇది వలస పాలకులు స్వతంత్ర పోరాటాన్ని అణచివేయడానికి ప్రభుత్వంపై వ్యతిరేకత రెచ్చగొట్టడం అన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. సుదీర్ఘ పోరాటం, అత్యంత త్యాగమయం, లక్షలాదిమంది ప్రాణతర్పణతో స్వాతంత్రం సాధించుకున్న ఒక దేశంలో వలస పాలన కాలంనాటి ఇటువంటి చట్టాలను కొనసాగించటం అత్యంత దుర్మార్గం.
బూర్జువా పార్టీలు ఇప్పటికే ఇటువంటి నిర్బంధ చట్టాల ఉపేక్షకు కారణం వారి వర్గ స్వార్థమేనని వేరే చెప్పనక్కరలేదు. నిజానికి ప్రభుత్వ వ్యతిరేకత, దేశ వ్యతిరేకత ఒకటి కాదు. ప్రభుత్వం మీదే కాదు, రాజ్యం మీద, రాజకీయ వ్యవస్థ మీద, ప్రస్తుతం సమాజంలో ఉన్న అనేక పెడధోరణుల మీద గొంతెత్తటం, అణగారిన ప్రజల్ని సమీకరించడం, పోరాటాలు నిర్మించడం ప్రజాతంత్ర వ్యవస్థలో అంతర్భాగం. కానీ దీన్నంతా తలక్రిందులు చేసి ప్రభుత్వాన్ని విమర్శించినా, వారి విధానాలను విమర్శించినా దేశద్రోహం క్రింద జమ గట్టి, రాజద్రోహం కింద కేసులు పెట్టే పరిస్థితికి ఈరోజు దేశం చేరింది. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకుంటూ తన ”మన్‌ కీ బాత్‌”లో దేశ ప్రధాని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది. అలాగే బీజేపీ నియంతృత్వ పాలనని విమర్శిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, బీజేపీ వారు బ్రిటిష్‌ పాలకుల నుండి నియంతృత్వ సామాగ్రిని అరువు తెచ్చుకున్నారనటం వారికి ఎమర్జెన్సీతో దేశాన్ని అతలాకుతలం చేసింది తమ అధినాయకులే అని గుర్తుకు రాకపోవడం యాదృచ్ఛికం కాదు.
పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారే కాదు, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న, ఉండిన వైసీపీ, టీడీపీ, జనతాదళ్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలన్నీ తమ పాలనలో ప్రభుత్వంపై విమర్శలను భరించలేక కొత్త కొత్త నల్ల చట్టాలను తెస్తూనే ఉన్నాయి. ‘రాజ ద్రోహం’ క్రిమినల్‌ చట్టం నుండి తొలగించకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నాయి. అసహనం, నిర్బంధం, అణచివేతలు పాలక పార్టీల విధానాల్లో విడదీయరాని అంతర్భాగం అయి పోయాయి. రాజ్యాంగం ప్రసాదిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కనుమరుగవుతున్నాయి. ఈ పరిస్థితి హిందూత్వ శక్తులు నడుపుతున్న ఫాసిస్టు తరహా రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి. అందువలన ఈ పరిస్థితిని సమూలంగా మార్చగల శక్తి, చారిత్రక బాధ్యత వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలది. పీడిత వర్గ పోరాటాలది. (జూన్‌25 ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు)
ఆర్‌. రఘు
సెల్‌: 9490098422