ప్రజల సొంతింటి కలలు నెరవేర్చండి

Fulfill people's dreams of owning– వారి హక్కులకు భంగం కల్గించొద్దు
– రియల్టర్లకు ‘రెరా’ చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజల సొంతింటి కలల్ని నెరవేర్చడంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఏజెంట్లు ప్రమాణాలు పాటించాలనీ, కొనుగోలుదారుల హక్కులకు ఎలాంటి భంగం కలిగించొద్దని తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌రెరా) చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ హెచ్చరించారు. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి అండ్‌ అవేర్‌నెస్‌, రెరా సంయుక్తాధ్వర్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఏజెంట్లకు జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండా ప్రకటనలు జారీ చేసి, వ్యాపార కార్యక్రమాలు చేయోద్దని చెప్పారు. ‘రెరా’ చట్టం కొనుగోలు దారుల హక్కులను పరిరక్షించడంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందన్నారు. వ్యవసాయ రంగం తర్వాత భవన నిర్మాణ రంగానికే అత్యంత ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. సొంతింటి కోసం కొనుగోలుదారులు తమ ఆదాయంలో 77శాతం వెచ్చించడాన్ని బట్టి రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో గుర్తించాలని చెప్పారు. మంచికంటే కూడా చెడు ఎక్కువ ప్రభావం చూపుతుందనీ, అందువల్ల వ్యాపారులు, ఏజెంట్లు కొనుగోలుదారుల విశ్వాసాన్ని కోల్పోవద్దని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న ‘రెరా’ సభ్యులు కే శ్రీనివాసరావు, కే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణ కోసం రెరా పని చేస్తుందన్నారు. దేశ, రాష్ట్ర ఆర్థికవృద్ధిలో నిర్మాణరంగ పాత్ర ప్రధానమైందని గుర్తుచేశారు. క్రెడారు అధ్యక్షులు పీ రామకష్ణారావు మాట్లాడుతూ రెరా చట్టాన్ని అన్ని వర్గాల వారు అవగాహన చేసుకోవాలనీ, ఈ రంగంలో అందరూ వినియోగదారులేనని స్పష్టం చేశారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా రియల్టర్లు బాధ్యతతో పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ‘రెరా’ చైర్మెన్‌ స్వయంగా రెరా చట్టంలోని పలు సెక్షన్లపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పలువురు బిల్డర్ల సందేహాలకు సమాధానాలు చెప్పారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ అసోసియేషన్‌ ఫర్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్‌ సంస్థ వ్యవస్థాపకులు హజీద్‌ సుల్తాన్‌ అలీ, మేనేజర్‌ శివకుమార్‌, నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మహ్మద్‌, రెరా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సురభి సత్తయ్య, జాయింట్‌ డైరెక్టర్‌ అశ్విని, పీఆర్వో పీ జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ
రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి వీడియో కాన్ఫరెన్స్‌ విధానాన్ని రెరా చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ ప్రారంభించారు. మంగళవారంనాడిక్కడి రెరా ప్రధాన కార్యాలయంలో సభ్యులు జే లక్ష్మీనారాయణ, కే శ్రీనివాసరావులతో కలిసి ఫిర్యాదుదారుడు ఇచ్చిన అర్జీపై ఆన్‌లైన్‌లో విచారణ జరిపారు. ఫిర్యాదుదారులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, వృద్ధాప్యంలో ఉండి విచారణకు హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నా, ఫిర్యాదుదారుడు ఇచ్చిన అర్జీ మేరకు వర్చువల్‌ విధానంలో హియరింగ్‌కు హాజరు కావచ్చునని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రెరా నిబంధనలు ఉల్లంఘించిన మూడు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. నాగోల్‌ చౌరస్తాలోని సుప్రజ ఆస్పత్రి సమీపంలో నాని డెవలపర్స్‌ పేరుతో కార్యాలయం ప్రారంభించి, రెరా రిజిస్ట్రేషన్‌ పొందకుండా శ్రీ లక్ష్మీనరసింహ కంట్రీ-3 పేరుతో ఆలేరు, యాదాద్రిలో వెంచర్లు చేపట్టి కరపత్రాలు బ్రోచర్ల ద్వారా కొనుగోలుదారులను ఆకర్షిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనీ, అలా చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొంటూ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. అలాగే ఖైరతాబాద్‌ ప్రేమ్‌ నగర్‌ కాలనీకి చెందిన ఆర్నా ఇన్ఫ్రా డెవలపర్స్‌కు కూడా నోటీసు జారీ చేశారు.