రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. ‘అన్ లిమిటెడ్ ఫన్’ అనేది ఉపశీర్షిక. విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు.
ఎ2 బి ఇండియా ప్రొడక్షన్‌లో రజిత్‌రావు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు డైమండ్ రత్నబాబు మీడియాతో మాట్లాడుతూ,
‘రచయితగా నేను రాసిన ‘పిల్లా నువ్వులేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం’ లాంటి నవ్వించిన సినిమాలే నాకు పేరు తీసుకొచ్చాయి. దర్శకుడిగా మారిన తర్వాత ప్రయోగాలు చేశాను. ఫలితాలు ఆశించినట్లు రాలేదు. ఇకపై నవ్వించే సినిమాలే నా నుంచి వస్తాయి. ఒకవేళ ప్రయాగాలు చేయాలనుకుంటే ఓటీటీలో చేస్తాను. ఇందులో సన్నీ, సప్తగిరి.. ఒకరు మచ్చా.. మరొకరు చిచ్చా. వీరిద్దరూ కలసి చేసే రచ్చని థియేటర్‌లో అందరూ ఎంజారు చేస్తారు. ఇందులో సన్నీ మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తే, సినిమాకి మరో ప్రధాన బలంగా జిలానీ రాందాస్‌గా సప్తగిరి కనిపిస్తారు. సినిమాని మోసుకెళ్ళే పాత్ర ఆయనది. చాలా అద్భుతంగా చేశారు. సినిమా మంచి స్వీట్‌లా ఉంటుంది. ఇందులో మంచి కాన్సెప్ట్ ఉంది. అది ఏమిటనేది ఇప్పుడే చెప్పకూడదు. ఈ సినిమా చూసిన తర్వాత మంచి స్క్రీన్‌ప్లే ఉందని అందరూ అభినందిస్తారు. ఇక ఈ సినిమాకి టైటిల్ పెట్టడానికి బాలకృష్ణ చేసిన ‘అన్ స్టాపబుల్’ షోనే కారణం. మా సినిమాని బాలకృష్ణ బర్త్‌డేకి చిన్న చిరు కానుకగా ఈనెల 9న విడుదల చేస్తున్నాం. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’ అని చెప్పారు.