పుత్తూరు పిల’గోడు’ సరదా కథలు

Puttur Pila 'Godu' funny storiesబాల్యంలో మనం చేసిన అల్లరి చేష్టలు, చిలిపి పనులు అవన్నీ గుర్తుండడం కష్టం. పెద్దయ్యాక అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు మనలో మనమే నవ్వుకుంటాం, సంతోషపడతాం. బాల్య జ్ఞాపకాల ఆధారంగా కథలు రాయడం మరీ కష్టం. అలాంటి ప్రయత్నమే చేశాడు ఆర్‌.సి.కష్ణస్వామి రాజు. తిరుపతికి చెందిన ఈయన జీవిత బీమా సంస్థలో పనిచేసి పదవి విరమణ చేసినా కూడా అసలు సిసలైన పల్లెటూరి వాతావరణంతో తన జీవితంలో జరిగిన సంఘటనలు, వాటి తాలూకు విషయాలు బాల్య స్మతులను కథల రూపంలో రాసి పాఠకుల హదయాలను గెలుచుకున్న దిట్ట కష్ణస్వామి రాజు. ఈయన కలం నుండి జాలు వారిన మరో స్వీయ సరదా కథల సంకలనం పుత్తూరు ‘పిలగోడు’.
పుస్తకానికి పుత్తూరు పిల’గోడు’ శీర్షిక పెట్టడం కూడా ఆలోచించదగ్గదే. ఇందులో పుత్తూరు పిలగోడుగా ”కిష్టడు” కనిపిస్తాడు. ఈ కథల్లో చాలా పాత్రలు ఉన్నా కూడా, ఆ పాత్రలన్నీ కిష్టడివి అన్నట్టు అనిపిస్తాయి. నిజానికి కథలన్నీ మంచి సందేశంతో కూడుకున్నవిగా చెప్పవచ్చు. నిజానికి ఈ కథలలో ప్రతి పాత్ర మన చుట్టూ ఉన్నట్టే అనిపిస్తాయి. పల్లెటూర్లలో నివసించే వారికి తప్పనిసరిగా అసలు పేరుకంటే మారు పేర్లు చాలా ఉంటాయి. మారుపేరు చెబితేనే వారు గుర్తుంటారు. అలాగే కథా రచయిత కష్ణస్వామి రాజు పాఠకులకు అందరికీ గుర్తుండేపోయే విధంగా కిష్టడి పాత్రను సష్టించాడు. ఈయన రాసిన కథలన్నీ కూడా వ్యంగ్యంతో, హాస్యంతో చమత్కారంతో, ఎంతో శోభాయామానంగా కథలను రాశారు. రచయిత పెట్టిన కథ శీర్షికలన్నీ ఒకటి రెండు పదాలతో కాకుండా వాక్య రూపంతో చాలా గమ్మత్తుగా అనిపిస్తాయి. అయినా అవి వాస్తవానికి దగ్గరగా ఉన్నవే అని ప్రతి పాఠకుడికి అనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఈ కిస్టడి పాత్ర ఒక రకంగా బాల్యంలోని రచయితది కావచ్చు అనే సందేహం కలుగుతుంది. ఈ పాత్ర మనకు నారద మహర్షిలాగా కనిపించినా, కిష్టడి పాత్రలో మాత్రం జగడాలు పెట్టుకునే వాడు కాదు. ఊర్లో ఎక్కడ ఏ సంఘటన జరిగిన తనని పిలవకపోయినా, అక్కడికి చేరుకునేవాడు. గ్రామస్తులందరికీ అందరికీ ఒక వారధిగా కనిపిస్తాడు. వాడి అమాయకత్వాన్ని చూసి మనలో మనమే నవ్వుకుంటాం. తీరిక లేకుండా అలసిన మన మనసులకు కిట్టడు చెప్పే కథలు వింటే చాలు .మనసు చాలా తేలిక అయి పోతుంది. ఇంకా చెప్పాలంటే గురుగింజంత సంగతి దొరికితే, గుమ్మడికాయ అంత కథ అందిస్తాడు. ఈ కథలన్నీ చదివితే మనం ఒక్కసారి మన బాల్యంలోకి తొంగి చూసుకుంటాం. మనకు కూడా బాల్య స్మతులతో కథలు రాయాలి అనే ఆలోచన కలుగుతుంది. ఇలాంటి హాస్యంతో కూడుకున్న టువంటి, వాస్తవానికి దగ్గరగా ఉన్న కథలను ఒక చక్కటి పాత్ర ద్వారా పాఠక క్రియలకు అందిస్తున్న రచయిత కష్ణస్వామి రాజుకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి కలం నుండి ఇలాంటి మరెన్నో కథలు వెలువడాలని కోరుకుందాం.
– యాడవరం చంద్రకాంత్‌గౌడ్‌
9441762105