జంట జలాశయాల రక్షణకు భవిష్యత్‌ కార్యాచరణ

– సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి
నవతెలంగాణ-కంటోన్మెంట్‌
గండిపేట(ఉస్మాన్‌సాగర్‌), హిమాయత్‌సాగర్‌ జలాశయాలను రక్షించుకోవడానికి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి అన్నారు. గురువారం హైదరాబాద్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని గురుస్వామి హాల్‌లో సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి ఆధ్వర్యంలో ‘111 జీవో రద్దు పట్నానికి పాడె’ అంశంపై సదస్సు నిర్వహించారు. తెలంగాణ సోషల్‌ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో పర్యావరణవేత్తలు, మేధావులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, విద్యావేత్తలు సుదీర్ఘ చర్చలు చేశారు. భవిష్యత్‌ కార్యాచరణపై తీర్మానాలు చేశారు.
ఈ సందర్భంగా పాశం యాదగిరి మాట్లాడుతూ.. ప్రభుత్వం 111 జీవో రద్దు చేసి పట్నానికి పాడె కడుతున్నదన్నారు. హైదరాబాద్‌- సికింద్రాబాద్‌ జంట నగరాలకు తాగు నీరందించే గండిపేట (ఉస్మాన్‌సాగర్‌), హిమాయత్‌సాగర్‌ జలాశయాలు మరో హుస్సేన్‌ సాగర్‌గా మారే ప్రమాదం ఉందన్నారు. జీవో 111 ఎత్తేయడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ఇప్పటికే పెరిగిన భారీ నిర్మాణాల వల్ల ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయని, భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను ధిక్కరించి ప్రభుత్వం జీవోను ఎత్తివేయడం పట్ల నిరసన తెలుపుతున్నామన్నారు.
ప్రొఫెసర్‌ దొంతే నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. 111 జీఓ రద్దు వల్ల జరిగే నష్టాల గురించి తెరపై వివరాలను చూపిస్తూ గణాంకాలను, వివిధ కమిటీల నివేదికలపై సమగ్ర సమాచారంతో వివరించారు. మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. నిస్వార్థులైన మేధావులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, పర్యావరణ సంరక్షకులు 10 మందితో కమిటీ వేసి సర్వే చేయించాలని, లేనియెడల ఈ కమిటీ కోసం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిద్దామని అన్నారు. కొందరు రాజకీయ నేతలంతా దొంగల ముఠాగా తయారయ్యారని విమర్శించారు. వారు దోచుకున్న డబ్బంతా విదేశాలకు తరలించి ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు. అలాగే 84 గ్రామాలలో పర్యటించి నిజమైన రైతుల వివరాలు, భూములు ఎవరెవరి దగ్గర ఉన్నాయన్న విషయంపై కూడా సర్వే చేయాలని తీర్మానించారు. ఈ సదస్సులో ప్రొ.నర్సింహారెడ్డి, ప్రొ.పురుషోత్తం రెడ్డి, ప్రొ.సుబ్బారావు, హైకోర్ట్‌ సీనియర్‌ అడ్వకేట్‌ రచనారెడ్డి, హైకోర్టు అడ్వకేట్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, జర్నలిస్ట్‌ శ్రీనివాస్‌, శభాజ, విద్యావంతుల వేదిక నాయకులు నాగన్న, మాజీ సైనికుడు డా.ఇంద్రసేన రెడ్డి, రైతు సంఘం నాయకులు రవి, ఇతర నాయకులు సురేందర్‌, పిట్టల నగేష్‌ ముదిరాజ్‌, డా.సురేందర్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్రధాన కార్యదర్శి వీరయ్య, నగర నాయకులు ఎం శ్రీనివాసరావు, నాగేశ్‌, సంగీత, కె రమేశ్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.