– క్రాస్‌రోడ్స్‌లో ‘సైకిల్’
– అధ్యక్షుడికి స్క్రీనింగ్ కమిటీకీ మధ్య రగడ
– రావుల పలాయనం
– ఖరారుకాని టికెట్లు
– పార్టీలో కొరవడిన సమన్వయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ శాఖలో అంతర్గత సమన్వయ లోపాలు పొడచూపాయి. అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో నెలకొన గందరగోళమే ఇందుకు సాక్ష్యం. పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్‌బ్యూరో సభ్యులతోకూడిన స్క్రీనింగ్ కమిటీ మధ్య తలెత్తిన విబేధాలు సమస్యలకు కారణమవుతున్నట్టు తెలిసింది. ఎన్నికల ముందు బస్సుయాత్ర చేపట్టాలని భావించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆ ప్రతిపాదన వాయిదా పడింది. బాబు జైలుకుపోకముందే తెలంగాణలో పోటీచేసే అభ్యర్థుల విషయమై చర్చ జరిగింది. అధ్యక్షుడు కాసాని జానేశ్వర్ పోటీచేసే అభ్యర్థులతో కూడిన జాబితాను బాబుకు సమర్పించారు. అయితే జాబితాను మరోసారి పరిశీలించాలంటూ పోలిట్‌బ్యూరోసభ్యులు, మరో ఇద్దరు, ముగ్గురితో కమిటీ వేశారు. ఆతర్వాత టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ అభ్యర్థుల పేర్ల ఖరారు వాయిదా పడుతూ వస్తున్నది. చంద్రబాబు పార్టీకి అందుబాటులో లేకపోవడం, అధ్యక్షుడు కాసాని అనారోగ్యం పాలుకావడంతో పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇటీవల కాసాని రాజమండ్రి వెళ్లి బాబుతో ములాఖాత్‌లోమాట్లాడి వచ్చారు. బాలకృష్ణ, భువనేశ్వరి, లోకేశ్‌తోనూ భేటీ అయ్యారు. ఒకవైపు ఈ ప్రక్రియ నడుస్తుండగానే, తెలంగాణలో టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తామని జనసేనాని పవణ్‌కళ్యాణ్ ప్రకటించారు. అయినా తమ పార్టీ రాజకీయ విధానం గురించి జనసేన నాయకుడు ఎలా ప్రకటిస్తాడనే వారూ టీడీపీలో ఉండటం గమనార్హం. ఈ విషయమూ ఇంకా కొలిక్కిరాలేదు. అయితే బీజేపీతో కలిసి ఎన్నికల గోదాలోకి దిగడానికి టీడీపీలోని సీనియర్లు, ఇతర నేతలకు ఇష్టం లేనట్టు సమాచారం. ఇదిలావుండగా కాసాని జ్ఞానేశ్వర్ తాను కుత్భుల్లాపూర్ నుంచి పోటీచేస్తానని మీడియాతో వ్యాఖ్యానించారు. ఇలా వేగంగా పరిణామాలు చోటుచేసుకున్నా, టీడీపీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగకపోవడంతో సమస్య ముదిరింది. ఈ అంశాలపై వెంటనే చర్చించి నిర్ణయంతో తీసుకోవాల్సిన నాయకత్వం మొండిగా వ్యవహరించిందనే వ్యాఖ్యానాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. పార్టీలోని పొలిట్‌బ్యూరో స్థాయిలోని వ్యక్తులు పోటీచేయడానికి ఆసక్తి చూపకపోవడం, అధ్యక్షులు కాసాని జాబితాతో విభేదించడం తదితర పరిణామాలు పార్టీలో అంతర్గతంగా స్ధబ్దత ఏర్పడింది. అది కూడా పార్టీకి నష్టమంటూ కొందరూ సీనియర్ నేతలు చెబుతూండటం గమనార్హం. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న స్వల్ప పొరపొచ్చాలను పక్కనబెట్టి బరిలోకి దిగే ఆలోచన చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఉమ్మడి నిర్ణయాలు తీసుకుని అమలుచేసే ప్రయత్నం జరగాలని సీనియర్లు భావిస్తున్నారు. పార్టీలో ఈపరిస్థితిని గమనించిన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ దర్శకత్వంలో రావుల పార్టీ మారినట్టుగా ఎన్టీఆర్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి.మరికొందరు నేతలు సైతం టీడీపీకీ రాంరాం చేప్పేఅవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే కాసాని జ్ఞానేశ్వర్ అన్నీ తానై పార్టీని నడిపిస్తుంటే, సీనియర్లు అడ్డు తగులుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. పోటీచేయడానికి ఇష్టపడని సీనియర్ నేతలు, అభ్యర్థుల ఖరారు విషయంలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ టీడీపీ క్రాస్‌రోడ్స్‌లో ఉందని అంటున్న వారూ లేకపోలేదు. అసలే క్యాడర్ అంతంత మాత్రంగా ఉన్న టీడీపీలో సమన్వయలేమీతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.