చిట పట చినుకులు
కలసికట్టుగా కురుస్తున్నాయి
చూరులోంచి రాలుతున్న నీటి పువ్వులు
గోడ వారగా జారి వాడ దారి పడుతున్నాయి
ఉసిళ్లు ఉప్పెనలా గుడ్డి లాంతరు చుట్టూ
గుమిగూడి గిరికీలు కొడుతున్నాయి
కప్పల బెకబెకలతో కీచురాళ్లు గొంతు కలిపి
రాతిరంతా చేసిన సంగీత జాతర
భూమి పొరల్ని చీల్చుకుంటూ
గుమ్మడి గింజ పురుడు పోసుకుంటోంది
తొలకరికి తొంగి చూసే ఆరుద్ర పురుగు
ఎర్రని ముద్దమందారం లా
పచ్చిక మీద పారాడుతోంది
ఇంటి ముందు రాతి గుండు
ధ్యానాన్ని భగంచేసే చినుకుల చిలిపి ప్రయత్నం
దండెం మీద ముత్యాల చినుకుల
సత్యాన్వేషణ
ఎదురు చూపుల
నాన్నమెడలో వాన చినుకుల దండ
వంటిల్లు చల్ల బడింది
వాన అంటే అందుకే
నాకు వల్లమాలిన ప్రేమ
– రెబ్బారం రాంబాబు