గాజా గాయం

Gaza woundతన పాలస్తీనా బిడ్డలు ఓడుతున్న రక్తం
భూమి తల్లి కన్నీరు
భూమి తల్లి రోదిస్తున్నది
పాలస్తీనా తల్లుల్లాగే
పిచ్చిగా అరుస్తూ సాపిస్తూ..
వినిపిస్తున్నదా మీకు
చచ్చుపడ్డ మనసు చెవులకు!

పిల్లలందరినీ ఒక్క తీరుగానే పెంచానే
వాడెందుకు తమ్ముళ్లనే క్రూరంగా చంపేస్తున్నాడని…
తానంతా బిడ్డలందరికీ సమానమే కదా
ఈ పోరలెందుకు ప్లాట్లు ప్లాట్లుగా
తనను సరిహద్దులు హద్దులుగా తవ్వుకుంటున్నారని…
భూమి తల్లి మనసు అరిగోస పడుతున్నది

బిడ్డలందరూ సమానంగా ఉండరు
ఒక ఇద్దరు కొట్లాడుకుంటుంటే
మిగతా కొడుకులు చోద్యం చూడ్డమేందని
అరుస్తున్నది భూమి తల్లి
పాలస్తీనా తల్లుల గొంతై..

మౌనం వీడక పోతే
మనకూ ఒక రోజొస్తుంది
భీకరంగా ఉరికిస్తూ పేల్చేస్తూ చంపేస్తూ
పిచ్చెక్కిన నరహంతకుల వేటలో బలవుతూ…
అప్పుడు కూడా భూమితల్లి ఇలాగే గుండెలు బాదుకుని ఏడుస్తుంది

విశ్వంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిని
నా పిల్లలైన మీ కోసం నన్ను నేను కాపాడుకుంటూ వచ్చానే..
పెరుగుతున్న సూర్యతాపానికి
ఉడుగుతున్న నా వయసుకి
ఈ బిడ్డలందరికీ ఏ దారి చూపాలా అని
నేను చింత పడుతుంటే
మీలో మీరు కొట్టుకు చస్తారేం రా
చవటల్లారా! పనికి మాలినోళ్ళారా!
నేను ముడుచుకుపోయి రాలిపోయిందాకైనా
అన్నదమ్ములమని యాది మరవక
కలిసి పచ్చ పచ్చగా బతకండిరా..

అర్థాంతరంగా మిమ్మల్ని నాలో కలుపుకోలేక
గుండెలు పగులుతున్న నా రోదనని
వినే సూక్ష్మ దర్శనం
మీకు కలిగితే బాగుండు కదరా!
– స్కైబాబ