– బీజేపీ సర్కార్ తీరు సిగ్గు చేటు : సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఏచూరి
తిరువనంతపురం : దేశంలోనే అత్యన్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను కూడా బీజేపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అని సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. తిరువనంతపురంలో ‘అయోధ్య తదనంతరం భారతదేశం’ పేరిట మలయాళ మీడియా సంస్థ ‘మాతృభూమి’ శనివారం నిర్వహించిన సాహిత్యోత్సవ సెమినార్‌లో ఏచూరి ప్రసంగించారు. ఓటు బ్యాంకు కోసమే ఒకే ఏడాది, అందునా ఎన్నికల వేళ పలువురికి ‘భారతరత్న’ పురస్కారాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందని, ఇది అత్యున్నత పురస్కారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకుర్‌కు మోడీ ప్రభుత్వం భారత రత్న ప్రకటించగా..జేడీియూ నేత, ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్‌డీఏ పంచన చేరిపోయారని ఏచూరి తెలిపారు. ఇప్పుడు జయంత్ సింగ్‌కు చెందిన ఆర్‌ఎల్‌డీని ఎన్‌డీఏలోకి లాగేందుకే ఆయన తాత అయిన చరణ్ సింగ్‌కు భారతరత్నను మోడీ సర్కార్ ప్రకటించిందని పేర్కొన్నారు. కీర్తిశేషులు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా ఈ ఏడాది భారతరత్న ప్రకటించారని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా చారిత్రాత్మక సమ్మె చేపట్టిన వ్యవసాయదారుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకే ఈ ఎత్తుగడను మోడీ సర్కార్ వేసిందని ఏచూరి పేర్కొన్నారు. హిందూత్వ అనేది కేవలం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రాజకీయ కార్యక్రమం తప్ప మరొకటి కాదన్నారు. అందువల్ల అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం దేశ చరిత్రలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మైలురాయి కాబోదన్నారు. అయోధ్య ఆలయం ప్రారంభం అనంతరం కూడా భారత్ ఎప్పటిలాగే ఉంటుందని తెలిపారు.