లింగ సమానత్వం తర్వాతే ఏకత్వం

 Gender equality is followed by unity– వ్యక్తిగత చట్టాల మార్పులతోనే యూసీసీ అమలు సాధ్యం
– మణిపూర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
– సీఎం రాజీనామా చేయాలి
– టీఎస్‌యూటీఎఫ్‌ సమావేశంలో : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఉమ్మడి పౌరస్మృతి కంటే ముందు వ్యక్తిగత చట్టాల్లో మార్పులు రావాలి. భిన్న మతాలు, సంస్కృతులకు నిలయమైన భారత దేశంలో వివిధ మతాల వ్యక్తి గత చట్టాల్లో (పర్సనల్‌లాస్‌) గల వివక్షను తొలగించిన అనంతరం మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి అమలు సాధ్యమౌతుంది. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం పౌరస్మృతిని ముందుకు తీసుకోస్తోంది’ అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీిఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య అధ్యక్షతన ‘ఉమ్మడి పౌరస్మృతి, మణిపూర్‌ పరిణామాలు’ అంశంపై నిర్వహించిన అధ్యయన వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మతాల్లో వ్యక్తి గత చట్టాల్లో మహిళల పట్ల వివక్ష ఉందని, కులాల అంతరాలు, సామాజిక వివక్ష కొనసాగుతోందన్నారు. స్త్రీ, పురుషల మధ్య సమానత్వం వస్తేనే ఏకత్వం సాధ్యమవు తుందని తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా పౌరులకు కల్పించిన హక్కులకు అనుగుణంగా మతాల వ్యక్తిగత చట్టాలు లేవని, మెజారిటీ మతం వ్యక్తిగత చట్టాలనే తమపై రుద్దుతారనే భావన మైనారిటీల్లో ఉందని చెప్పారు. ఇటువంటి అసమానతలు, అభద్రతా భావాల మధ్య తీసుకువచ్చే ఉమ్మడి పౌరస్మృతి జాతీయ సమైక్యతకు మేలు కంటే కీడు ఎక్కువ చేస్తుందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాను విడుదల చేయకుండా చర్చ పెట్టటం కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికేనని విమర్శించారు. గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమలవుతుందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఉత్తరఖాండ్‌లో గిరిజనులకు, ఈశాన్య రాష్ట్రాలకు ఉమ్మడి పౌరస్మృతి వర్తించదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదని తెలిపారు. దీన్ని దేశం కోసం కాకుండా ముస్లింల కోసమే తీసుకురావడానికి బీజేపీ సర్కార్‌ కుట్ర చేస్తున్నదని అన్నారు. మేధావులు, లౌకిక, ప్రజాస్వామిక వాదులు పాలకుల ఎత్తుగడలను అవగాహన చేసుకుని ప్రజల మధ్య ఐక్యతకు కషి చేయాలని కోరారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వైఫల్యమే మణిపూర్‌ మారణహౌమానికి కారణమన్నారు. మణిపూర్‌లోని కుకీ తెగ ప్రజలపై మెజారిటీ తెగ మైథీలు దాడులు చేస్తున్నారని అన్నారు. ఆస్తుల ధ్వంసం, మహిళలపై పైశాచిక వేధింపులకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లోని అటవీ, ఖనిజ సంపదపై కన్నేసిన కార్పొరేట్‌ వ్యాపారుల ప్రయోజనాలకోసం ప్రజల మధ్య మత చిచ్చు రగిల్చి దారుణ మారణహౌమానికి పాల్పడుతున్నారన్నారు. ప్రధాన మంత్రి మౌనం సమర్ధనీయం కాదన్నారు. అఖిల పక్షం పర్యటించి శాంతి, సామరస్యం నెలకొల్పాలని, బాధితులకు బాసటగా నిలవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సెమినార్‌లో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి, స్టడీ సర్కిల్‌ కన్వీనర్‌ కె.సోమశేఖర్‌, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, పత్రిక సంపాదకులు పి.మాణిక్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఈ.గాలయ్య, కె.రవికుమార్‌, జి.నాగమణి, ఎ.సింహాచలం, డి.సత్యానంద్‌, ఎస్‌వై.కొండలరావు, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.