– కలెక్టరేట్ల ముందు ధర్నాలు
– సమ్మె నోటీసుల అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జీవో 142ను రద్దు చేయాలని జీవో 142 రద్దు పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం 33 జిల్లాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల ముందు వైద్యారోగ్యశాఖలోని డాక్టర్లు, పారామెడికల్ ఉద్యోగుల యూనియన్స్, అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ధర్నాలను నిర్వహించారు. అనంతరం సమ్మె నోటీసులను అందజేశారు. జీవో 142 రద్దు పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ సభ్యులు కె.యాదానాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. 33 జిల్లాల్లో ధర్నాలు విజయవంతమయ్యాయని తెలిపారు. ఈ జీవో అమలైతే నాలుగు వేల పోస్టులు రద్దయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ వనరుల హేతబద్ధీకరణ అనేది జనాభా ప్రాతిపదికన ప్రజలకు మెరుగైన వైద్యారోగ్య సేవలు అందించేందుకు చేయాలని సూచించారు. ఇప్పటికైనా బేషజాలకు పోకుండా 142ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ధర్నాల్లో కె.యాదానాయక్ (వరంగల్ జిల్లా), బి.వెంకటేశ్వర్ రెడ్డి, రాబర్ట్ బ్రూస్, జి.రాజశేఖర్, రామలక్ష్మిలతో పాటు ఆయా జిల్లాల్లో నాయకులు, అన్ని క్యాడర్ల ఉద్యోగులు పాల్గొన్నారు.