– మా విచారణలో ఏమీ లభించలేదు
– నూహ్ హింసలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తంపై కోర్టుకు హర్యానా పోలీసుల వెల్లడి
న్యూఢిల్లీ : నూహ్ లో చెలరేగిన మత హింసకు సంబంధించి ఈనెల 15న అరెస్టయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌కు ఉపశమనం లభించింది. ఆయను విచారించగా ఎలాంటి ఆధారాలూ లభించలేదని హర్యానా పోలీసులు కోర్టుకు తెలిపారు. జులై 31న నూహ్ లో హింసాత్మక అల్లర్లు చెలరేగిన విషయం విదితమే. రెండ్రోజుల పోలీసు రిమాండ్ ముగిశాక ఖాన్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఫిరోజ్‌పూర్ జిర్కా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మమ్మన్ ఖాన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. నగీనాలో అల్లర్లు, దేశద్రోహానికి సంబంధించిన నాలుగు ఎఫ్‌ఐఆర్‌లలో ఖాన్ పేరు పెట్టడంతో పాటు, దర్యాప్తులో సహకరించనందుకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఖాన్ నిర్దోషి అని అతని న్యాయవాది తాహిర్ హుస్సేన్ కోర్టులో వాదించారు. హింసతో అతనికి సంబంధం ఉన్నదనటానికి ఎటువంటి ఆధారాలూ లభించలేదని పోలీసులు కూడా అంగీకరిస్తున్నారని చెప్పారు. ఖాన్ విచారణకు సహకరించేందుకు నిరాకరించారనే ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాదులు కొట్టిపారేశారు.
జులై 31న విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) యాత్ర సందర్భంగా చెలరేగిన హింసాకాండకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. హర్యానా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ డిప్యూటీ లీడర్, నుహ్ ఎమ్మెల్యే అఫ్తాబ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఖాన్‌ను కుట్రలో ఇరికిస్తున్నారని అన్నారు.