గురుకుల విద్యార్థులకు ల్యాప్ టాప్స్‘గిఫ్ట్‌’

– ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్య
– మంత్రి హరీష్ రావు చొరవతో వెయ్యి మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు పంపిణీకి సిద్ధం
నవతెలంగాణ – సిద్దిపేట
గురుకులాల్లో చదివే విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతున్నది. గతంతో పోల్చితే గురుకుల పాఠశాలలలో ఉత్తీర్ణత శాతం అత్యధికంగా పెరిగింది. సిద్ధిపేట జిల్లాలోని 11, 12వ తరగతి ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక సాఫ్ట్ వేర్, కోచింగ్ మెటీరియల్ తో కూడిన ల్యాల్ టాప్ లను పంపిణీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీని ఈ నెలలో నెరవేర్చనున్నారు.
మంత్రి హరీష్ రావు చొరవతో ల్యాప్ ట్యాప్ పంపిణీ…
 సిద్ధిపేట జిల్లాలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్స్ జగదేవ్ పూర్, చింతమడక, శేరిపల్లి బంధారం, హుస్నాబాద్ లలో ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్ చదివే 396 మంది విద్యార్థినీలకు పంపిణీకి, జిల్లాలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర స్కూల్స్ గొల్లపల్లి, నారాయణరావుపేట, దౌల్తాబాద్ లలో ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్ చదివే 288 మంది విద్యార్థులకు పంపిణీకి సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్  గురుకుల జూనియర్ బాలికల రెసిడెన్షియల్ కళాశాల సిద్ధిపేట రూరల్ లో ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్ చదివే 160 మంది విద్యార్థినీలకు, అలాగే తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ గురుకుల జూనియర్ బాలికల రెసిడెన్షియల్ కళాశాల మిట్టపల్లిలో ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్ చదివే 160 మంది విద్యార్థినీలకు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1000 మందికి ల్యాప్ ట్యాబ్ పంపిణీ సిద్ధమయ్యాయి. రూ.80 వేల ఖరీదు చేసే ఈ ల్యాప్ టాప్ కంప్యూటర్లు వారి విద్యాభివృద్ధికి తోడ్పడనున్నాయి. ప్రతి సబ్జెక్టుపై అవగాహన పెంచుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తాయని, ఐఐటీ, ఎంసెట్, నీట్‌కు, సీయూసెట్‌లో మెరుగైన ఫలితాల సాధనకు తోడ్పడుతున్నాయని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.