ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వండి.. ఆశావర్కర్ల డిమాండ్‌

Give fixed salary..
Ashawarkar's demand– జాబ్‌చార్ట్‌ ప్రకటించాలని డిమాండ్‌
– రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె
– సికింద్రాబాద్‌లోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం వద్ద ధర్నా
నవతెలంగాణ-బేగంపేట్‌/విలేకరులు
తమ సమస్యల పరిష్కారం.. ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మెలో భాగంగా మంగళవారం ధర్నా చేశారు. సికింద్రాబాద్‌లోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌, సౌత్‌ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న దరలను దృష్టిలో పెట్టుకొని ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18,000 ఇవ్వాలని కోరారు. అలాగే ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సౌత్‌ కమిటీ అధ్యక్షులు ఎం.మీనా మాట్లాడుతూ.. ఆశాలకు జాబ్‌ చార్ట్‌ ప్రకటించాలని, పారితోషికం లేని పనులు చెప్పొద్దని డిమాండ్‌ చేశారు. 6 నెలల పీఆర్సీ బకాయిలు, కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 18 నెలల కరోనా రిస్క్‌ అలవెన్స్‌ వెంటనే ఇవ్వాలని కోరారు. ఆశాలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే యూనియన్‌తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారించాలని, లేనియెడల సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్‌ నాయకులు ఆర్‌.మల్లేష్‌, తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) నాయకులు భాగ్యలక్ష్మి, సాధన, రీటా, రాధిక,సఫియా, సంగీత, కవిత తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. మల్కాజిగిరి చౌరస్తాలోనూ ధర్నా చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆశావర్కర్లు ఏరియాస్పత్రి ఎదుట సమ్మె చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. ఆశావర్కర్లకు కనీస వేతనమివ్వాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు ఆశావర్కర్ల సమ్మె కొనసాగింది. పరిగిలో సమ్మెకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఆమనగల్‌లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కిషన్‌ మద్దతు తెలిపారు. చేవెళ్లలో ఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌ మద్దతు తెలిపారు. యాచారంలో సమ్మెలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొత్తూరులో సమ్మెకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా మద్దతు తెలిపారు.