స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వండి

– ద్వేషపూరిత ప్రసంగాలపై
– రాష్ట్రాల నోడల్‌ అధికారుల నియామకాలపై
– కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ద్వేషపూరిత ప్రసంగాలపై రాష్ట్రాల నోడల్‌ అధికారుల నియామకాలపై స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశమిచ్చింది. ఇటీవల హర్యానా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ముస్లింలను సామాజిక బహిష్కరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలు, హింసాకాండను అరికట్టేందు కు చర్యలు తీసుకోవాలని, అందుకు ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలోని రాష్ట్రాలు పోలీసు సిబ్బందిని మోహరింప జేయడం, సీసీటీవీల ఏర్పాటు, వేదిక వద్ద చేసిన ప్రసంగాల వీడియోగ్రఫీని ఏర్పాటు చేయాలని ఈనెల ప్రారంభంలో ధర్మాసనం ఆదేశించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ద్వేషపూరిత ప్రసంగాన్ని పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా యంత్రాంగాన్ని బలోపేతం చేయడాన్ని పరిగణనలోకి తీసుకునేలా ధర్మాసనం ఆదేశించింది.
మొదటి చర్యగా, తెహసీన్‌ పూనావాలా దాఖలు చేసిన పిటిషన్‌లో 2018 నాటి తీర్పు మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసరించాయో లేదో తెలుసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. గోసంరక్షక గ్రూపుల మాబ్‌ లిన్చింగ్‌ (మూకసామ్యం), ద్వేషపూరిత నేరాలు పెరుగుతున్న సందర్భాల నేపథ్యంలో ఈ తీర్పు ఇచ్చింది. దేశంలోని ప్రతి జిల్లాకు పోలీసు సూపరింటెండెంట్‌ (ఎస్పీ) స్థాయికి తగ్గని నోడల్‌ అధికారిని నియమించాలని కోర్టు ఆదేశించింది.
నోడల్‌ అధికారుల నియామకానికి సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) సమాచారాన్ని తీసుకోవాలని, మూడు వారాల్లో స్టేటస్‌ రిపోర్టును దాఖలు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ద్వేషపూరిత ప్రసంగాల కేసు డైరీని కూడా నోడల్‌ అధికారులు నిర్వహించాలని, 2018 తీర్పు ప్రకారం ఇప్పటికే ఏర్పాటు చేసిన యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
ఈ ఉత్తర్వుతో నోడల్‌ అధికారి లేని రాష్ట్రాలు, జిల్లాలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో తెలుసుకోవాలని ధర్మాసనం సూచించింది. ప్రతి జిల్లాలో ద్వేషపూరిత ప్రసంగాలను రికార్డ్‌ చేయమని నోడల్‌ అధికారులను ఎలా అడగవచ్చో, సీసీటీవీలను ఇన్‌స్టాల్‌ చేయడంతో నోడల్‌ అధికారికి, ద్వేషపూరిత ప్రసంగాలను నివేదించడం గురించి పోలీసులకు అవగాహన కల్పించడంతో ఈ చర్యకు సహాయపడవచ్చు అనే దానిపై మార్గదర్శకాలనూ ప్రతిపాదించా లని ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. మతపరమైన ఉద్రిక్తత హింసకు దారి తీసే ద్వేషపూరిత ప్రసంగాల వీడియోల ప్రసరణ కూడా రికార్డు చేయాలని ధర్మాసనం సూచించింది. ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల సంఖ్య ఐదు, ఆరు కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని మెరుగ్గా నిర్వహించడం, పర్యవేక్షించడం కోసం ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీసీపీ) ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ప్రతిపాదించింది.
”లెటర్‌ ఆఫ్‌ లా అమలు అవుతుందని నిర్ధారించడానికి సమర్థవంతమైన ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము” అని ధర్మాసనం పేర్కొంది. పైన పేర్కొ న్న మార్గాలపై ముసాయిదా మార్గదర్శకాలను రూపొం దించి, కోర్టుకు సమర్పించాలని కేంద్రం తరపున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఎఎస్జి) కెఎం నటరాజ్‌ను కోరారు. నోడల్‌ అధికారులపై రాష్ట్రాల నుండి డేటాను కంపైల్‌ చేయడానికి ఎఎస్జి మరింత సమయం కోరారు. సమాచారం ఇవ్వడంలో విఫలమైన రాష్ట్రాల గురించి తెలియజేయాలని ధర్మాసనం కోరింది. తదుపరి విచారణ తేదీలోగా ఈ విషయంలో సూచనలు తీసుకోవా లని అన్ని రాష్ట్రాలకు హాజరయ్యే న్యాయవాదులను కూడా కోరింది.
పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పియుసిఎల్‌) తరపున సీనియర్‌ న్యాయవాది సంజరు పారిఖ్‌ ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు ఆయన రూపొందించిన కొన్ని సూచనలను సమర్పించారు. తదుపరి తేదీలోగా పరిగణించేందుకు కోర్టు అంగీకరించింది. మరో పిటిషనర్‌ షాహీన్‌ అబ్దుల్లా తరపున న్యాయవాది నిజాం పాషా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుందని కోర్టుకు తెలిపారు. ద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటోగా ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులను ఆదేశిస్తూ, ఈ ఆదేశాలను పాటించడంలో విఫలమైన నేరస్థులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదిస్తూ గత ఏడాది అక్టోబర్‌ 21న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఆయన ప్రస్తావించారు. ”మార్గదర్శకాలు అమలులో ఉన్నాయి. కానీ దానిని అమలు చేయడానికి రాజకీయ సంకల్పం లేదు” అని పేర్కొన్నారు. ద్వేషపూరిత ప్రసంగం అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం లేకపోవడం కూడా ఈ నేరాలను నమోదు చేయడంలో ప్రతిబంధకంగా ఉందని మరో న్యాయవాది కాళేశ్వరం రాజ్‌ అన్నారు. ”చట్టం స్పష్టంగా ఉంది. కానీ ఒక నిర్దిష్ట పరిస్థితిలో చట్టం అవగాహన స్పష్టంగా ఉండాలి” అని అన్నారు.