భూసేకరణ కేసుల వివరాలివ్వండి

– సిద్దిపేట కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సిద్దిపేట జిల్లాలో 22 భూసేకరణ నోటిఫికేషన్ల ప్రొసీడింగ్‌ల రికార్డుల్ని సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని ఆ జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాధవీదేవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో గడువు ముగిసిన తర్వాత భూసేకరణ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ల పొడిగింపునకు ఉత్తర్వులు ఇవ్వడాన్ని పిటిషనర్లు సవాల్‌ చేసిన వ్యాజ్యంపై విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. సిద్దిపేట జిల్లాలో 2022, గెజిట్‌ నంబర్‌ 109 నుంచి 125 వరకు గడువు ముగిసిందని, గడువు ముగిసినా ప్రిలిమినరీ నోటిఫికేషన్ల ఆధారంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తోందని పిటిషనర్ల వాదన. కౌంటర్‌ దాఖలుకు 2 వారాల గడువు కావాలని ప్రభుత్వం కోరింది. భూసేకరణ నోటిఫికేషన్ల పొడిగింపునకు చెందిన రికార్డులను సీల్డ్‌ కవర్‌లో అందజేస్తే తదుపరి విచారణలో వాటిని పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు వెల్లడింది.