– జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సీఎం, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా కల్పించా లని జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజప్తి చేశారు. జలశక్తి మంత్రి షెకావత్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి వివరించారు. కరువు, ఫ్లోరైడ్ పీడిత జిల్లాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి సాగు నీరు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నుంచి ఆరు జిల్లాల పరిధిలోని 1,226 గ్రామాలతో పాటు హైదరాబాద్ మహా నగరానికి తాగు నీరు సరఫరా చేయాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పలు అనుమతులు తీసుకున్నా ఇంకా హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా వ్యయం, బీసీ రేషియో, అంతరాష్ట్ర అంశాలు కేంద్ర జల సంఘం పరిశీలనలో ఉన్నాయని, వాటికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని జలశక్తి మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు.
కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు : ఉత్తమ్ కుమార్‌రెడ్డి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అదనపు నిధుల కేటాయింపునకు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. జలశక్తి మంత్రిని కలిసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము పాలమూరు-రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని జలశక్తి మంత్రిని కోరామని తెలిపారు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని, ఈ విధానం ప్రస్తుతం అమలులో లేదని జలశక్తి మంత్రి తెలిపారన్నారు. అయితే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా ఆ ప్రాజెక్టుకు తమ శాఖ పరిధిలోని మరో పథకం కింద 60 శాతం నిధులు కేటాయిస్తామని జల్‌శక్తి మంత్రి హామీ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీ పూర్తిగా విఫలమైందని, పేపర్ లీకులతో భ్రష్టు పట్టినందున దానిని సంస్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో మార్చేందుకుగానూ శుక్రవారం యూపీఎస్సీ ఛైర్మన్‌తో ముఖ్యమంత్రి, తానూ సమావేశం కానునున్నట్టు ఆయన చెప్పారు.