టీఆర్టీ నోటిఫికేషన్‌ ఇవ్వండి

– సీఎం కేసీఆర్‌కు డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్‌రెడ్డి, నాయకులు శ్రీను నాయక్‌, నరేష్‌, హరీశ్‌, భాను, కోటేష్‌, ఇర్ఫాన్‌, చంద్రశేఖర్‌, శ్రీను, లక్ష్మణ్‌, స్వప్న, కవిత లేఖ రాశారు. టెట్‌ పరీక్ష నిర్వహించి ఏడాది పూర్తవుతున్నా ఇంత వరకు ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచిందని విమర్శించారు. దీంతో నాలుగు లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని తెలిపారు. 80 వేల ఉద్యోగాల్లో అన్ని రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయని పేర్కొన్నారు. కానీ ఒక్క టీఆర్టీపై నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని తెలిపారు. 12 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ గతేడాది అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ ఇంతవరకూ ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకుండా ఉండడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. త్వరలో ఎన్నికల కోడ్‌ రాబోతుందనీ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు ముడిపెట్టకుండా వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావుకు రెండు మూడురోజుల్లో భారీగా లేఖలు రాస్తామని తెలిపారు.