ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు బంగారు భవిష్యత్తు.

– జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ.
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్: ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మహబూబాబాద్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ అన్నారు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని అమ్మాపురం క్లస్టర్ గ్రామాల రైతులతో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిహెచ్ఎస్ఓ సూర్యనారాయణ మాట్లాడుతూ సాంప్రదాయ నూనగింజల ఆయిల్ ఫామ్ పంట నూనె దిగుబడి 4 నుండి 5 రెట్లు అధికంగా ఉంటుందని ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన తర్వాత 4 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు నిరంతర దిగుబడితో నిరంతర ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని తెగుళ్లు, చీడపీడలు ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్ సాగులో చాలా తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట తుఫాను, వడగండ్ల వానలు మొదలగు ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటుందని దీనికి కోతుల బెడద, అడవి పందుల బెడద, దొంగల బెడద, ఆయిల్ ఫామ్ పంటలకు ఉండదని ఆయిల్ ఫామ్ సాగులో ఖర్చు చాలా తక్కువగా, కూలీల అవసరం చాలా తక్కువ వరకు ఉంటుందని ఒక వ్యక్తి పది ఎకరాల ఆయిల్ ఫామ్ తోటను సులువుగా పర్యవేక్షించొచ్చని ఆయన అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు వల్ల నిరంతర దిగుబడి ఆదాయంతో రైతుల ఆర్థిక పురోగతి అత్యున్నత దశకు చేరుకొని రైతు మాత్రమే కాకుండా రైతుల భావితరాలు కూడా ఆయిల్ ఫామ్ తో లబ్ధి పొందే అవకాశం ఉందని ఇతర పంటలతో పోలిస్తే ఖర్చులు పోను ఆయిల్ ఫాం సాగు వలన ఏడాదికి ఎకరాకు నికరంగా లక్ష రూపాయలు ఆదాయం మిగులుతుందని ఆయన తెలిపారు. మొదటి మూడు సంవత్సరాలు ఆదాయం కోసం అంతర పంటలుగా కూరగాయలు, మొక్కజొన్న, పత్తి బొబ్బర్లు, పెసర్లు, కందులు, ఉలువలు, పొద్దు తిరుగుడు, అరటి, బొప్పాయి, వేరుశనగలాంటి పంటలు పండించవచ్చు అని ఐదు సంవత్సరాల తర్వాత కూడా కోకో మరియు పొట్టి మిరియాలు మొదలగు పంటలను అంతర పంటలుగా పండించి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ఆయన తెలిపారు. రైతు పండించిన దిగుబడిని రైతు పొలాల నుండి నేరుగా ఫ్యాక్టరీ కి తరలించిన వారి గెలల రవాణా చార్జీలను ప్రభుత్వ రంగ సంస్థ టీఎస్ ఆయిల్ పడ్ సంస్థ భరిస్తుందని తెలిపారు. ఇట్టి ఆయిల్ ఫామ్ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయని ఇందుకు నీటి వసతి ఉండాలని, ఆయిల్ ఫామ్ సాగు వల్ల వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయిల్ ఫామ్ తోటలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నిరంతర వర్షాలు నీటి వనరులతో సస్యశ్యామల వాతావరణం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంటల సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ పంట యాజమాన్యం అంతర పంటల సాగుపై రాయితీలు కూడా కల్పిస్తుందని దీనితోపాటు డ్రిప్పు పరికరాలపై సబ్సిడీ కూడా ఇస్తుందని ఆయిల్ ఫామ్ సాగుపై ఎక్కువ మొత్తంలో రైతులకు సబ్సిడీ ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన రైతులకు మూడు సంవత్సరాలకు గాను 41,325 ఎకరానికి అదనంగా లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి సిహెచ్ రాకేష్, మండల వ్యవసాయ అధికారి కుమార్, గుర్తురు గ్రామ సర్పంచ్ రవీంద్ర చారి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు తమ్మెర వీరభద్ర రావు, వ్యవసాయ విస్తరణాధికారులు దీపిక, జమున, అమ్మపురం గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గూడెల్లి యాకయ్య, రైతులు తీగల సంజీవరెడ్డి, గట్టు వెంకన్న, ముడుపు రాజిరెడ్డి, పుల్లారెడ్డి, చీకటి వెంకన్న, బానోత్ సోమల నాయక్, గుగులోతు రమేష్ నాయక్, టి ఎస్ ఆయిల్ పేడ్ సంస్థ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.