బీఆర్‌ఎస్‌కు మైనంపల్లి గుడ్‌బై

Goodbye Mynampally to BRS– ప్రజల కోరిక మేరకు పార్టీని వీడుతున్నట్టు ప్రకటన
– వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే
– 26న సోనియా, రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియోను విడుదల చేశారు. దీంతో కొంతకాలంగా సాగుతున్న హైడ్రామాకు తెరపడినట్టయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి తనతో పాటు కుమారుడు రోహిత్‌కు మెదక్‌ టికెట్‌ ఆశించారు. అయితే సీఎం కేసీఆర్‌ ప్రకటించిన 115 మంది అభ్యర్ధుల జాబితాలో మల్కాజిగిరి నుంచి హనుమంతరావుకు టికెట్‌ కేటాయించగా.. రోహిత్‌కు మాత్రం నిరాకరించారు. ఈ పరిణామాలతో మైనంపల్లి హనుమంతరావు రగిలిపోయారు. తన కొడుక్కి టికెట్‌ రాకుండా చేశారంటూ మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీన్ని బీఆర్‌ఎస్‌ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని, మైనంపల్లి ప్లేస్‌లో మల్కాజిగిరిలో మరొకరికి అవకాశం ఇస్తుందని ప్రచారం జరిగింది. కానీ అలాంటివేవీ ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరబోయేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పిన మైనంపల్లి.. మల్కాజిగిరి ప్రజలకు అండగా ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకూ ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని, దేనికీ లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
26న కాంగ్రెస్‌లోకి..!
మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్‌లో చేరుతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తండ్రీకొడుకులిద్దరికీ ఆ పార్టీ టికెట్‌ ఆఫర్‌ చేసిందని.. దీంతో మైనంపల్లి త్వరలోనే బీఆర్‌ఎస్‌ను వీడుతారంటూ ఊహాగానాలు వచ్చాయి. చివరకు కార్యకర్తలు, అనుచరుల సూచన మేరకు బీఆర్‌ఎస్‌ను వీడాలనే మైనంపల్లి నిర్ణయించుకున్నారు. ఈనెల 17వ తేదీన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన సభలోనే కాంగ్రెస్‌లో చేరాల్సి ఉన్నా.. చేరలేదు. సీఎం కేసీఆర్‌ పిలుపు కోసం ఎదురు చూసిన మైనంపల్లికి దాదాపు వారం రోజులు గడిచినా పిలుపు రాలేదు. దీంతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.,సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు.