పొద్దు గూట్లె పడంగనే నోట్లెకు అన్నం బుక్క పడాల్సిందే పూర్వకాలంల. ఇప్పటి లెక్క టివిల ముందు కూసోని ఏ రాత్రి తర్వాతో తినే కాలం కాదు అది. పొద్దుందాక వ్యవసాయ పనుల్లో శ్రమించి సూర్యాస్తమయం కాగానే ఇంటికి చేరి అన్నం తిని పడుకోవడమే. అందుకే ‘గూట్లె పొద్దు నోట్లె బుక్క’ అనేవాల్లు. శ్రమ జీవితంలో అనేక సామెతలు పుట్టాయి. వ్యసాయ కూలీలకు ఇంటికి వెళ్లేందుకు గడియారం లోని సమయంతో సంబంధం లేదు. ‘బీరపువ్వు పూసే యాల్ల అయ్యింది’ ఇంటికి పోనియ్యవానయ్య అని ఆసామిని అడిగేటోల్లు. అట్లనే పొద్దుతో సంబంధం వున్న ముచ్చట్లు చాలానే వున్నాయి. ‘పొద్దు పొడిచి బారెడు ఎక్కింది’ ఇంకా లేవవా అని అప్పటి చిన్న పిల్లగాలను బాపమ్మలు మందలించేవాల్లు. తెల్లవారి లేచి పనికి పోయే సందర్భంలో పొద్దు బారెడు ఎక్కింది, ఇంకా ఎడ్లను కొట్టుక పోతలేవు అని కూడా మందలిస్తరు. అట్లనే పని చేసే కాడ ఆకలి యాల్లకు ‘పొద్దు నడినెత్తి మీదికి ఎక్కింది’ సద్దులు తిన పోవద్దా అనేవాల్లు. నాట్లేసే దగ్గర కలుపు తీసే దగ్గర మహిళలతోనే పని వుంటది. ఆడవాళ్లు, పిల్ల తల్లులు కూడా వస్తుంటరు. వాళ్లకు మాత్రం ఇంటికి పోయి చిన్నపిల్లలకు పాలు పట్టే అవకాశం వుంటది. అటువంటి సందర్భాన్ని ‘పాలియాల్ల అయ్యింది’ అనేవారు. అంటే మధ్యాహ్నం 12 – 1 మధ్యల పాలు ఇచ్చి వస్తుండే సమయం అది. అట్లనే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం కు ఇంటికి వెళ్లాలి. దానికి ‘పొద్దు గూట్లె పడే యాల్ల’ అయ్యింది అంటరు. పొద్దు అంటే సూర్యుడు గూట్లె పడడం. గూటిలో అంటె ఇంటిలో. సూర్యుని ఇంటికి సూర్యుడు పోవుడు అన్నట్లు. అందుకే గూట్లె పడే యాల్ల అంటరు. ఆ సమయంలో శ్రమ జీవులైన వ్యవసాయ కూలీలు ఇంటికి వెళ్లే వేళ అని. దానినే ‘పొద్దు గూట్లె పడ్డది’ అని కూడా అంటరు. జానపదుల జీవితం అంతా సృజనాత్మక సంభాషణలే.
– అన్నవరం దేవేందర్,
9440763479