గౌలిపుర కబేలా స్థలాన్ని రక్షించాలి

Goulipura Kabela site should be protected– తప్పుడు అఫిడవిట్‌ దాఖలుపై విచారణ చేపట్టాల
– భూ కబ్జాదారులు, అధికారులపై చర్యలు తీసుకోవాలి
– సహకరించిన వారిని సస్పెండ్‌ చేయాలి : సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ గౌలిపుర మున్సిపల్‌ పరిధిలోని కబేలా స్థలాన్ని కబ్జా నుంచి రక్షించాలని సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ స్నేహా అంబరీష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి గౌలిపుర మున్సిపల్‌ కబేలా ఉందన్నారు. 4.2 ఎకరాల స్థలంలో ఉన్న దాదాపు రూ.100 కోట్ల విలువైన కబేలా అతి పురాతనమైందని చెప్పారు. 2003లో హైకోర్టు ఆదేశాలతో అన్ని కబేలాలతోపాటు గౌలిపుర కబేలా కూడా మూతపడిందన్నారు. తదనంతరం గౌలిపుర కబేలా ఆధునీకరణ కోసం జీహెచ్‌ఎంసీ రూ.7 కోట్లు కేటాయించి 95 శాతం పనులు పూర్తి చేసిందని గుర్తు చేశారు. 1954-55 నుంచి రెవెన్యూ పహాణి రికార్డుల్లో 4.2 ఎకరాల కబేలా ఉన్నట్టు నమోదైందన్నారు. కొందరు కబేలా స్థలంతోపాటు చుట్టూ ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2010లో భూకబ్జాదారులకు అనుకూలంగా కబేలా స్థలంతో పాటు 8 ఎకరాల భూమిని హైదరాబాద్‌ కలెక్టర్‌గా వున్న నవీన్‌ మిట్టల్‌ అక్రమంగా మ్యుటేషన్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్‌ మిట్టల్‌ చేసిన మ్యుటేషన్‌ తప్పని నిర్ధారిస్తూ తదనంతరం వచ్చిన కలెక్టర్‌ ఎన్‌ఎస్‌ గుల్జార్‌ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు.
కబేలా భూమితో పాటు మరికొన్ని ప్రభుత్వ భూములను కూడా అక్రమంగా మ్యుటేషన్‌ చేశారని నవీన్‌ మిట్టల్‌పై రాష్ట్ర ప్రభుత్వం చార్జిషీట్‌ నమోదు చేసిందన్నారు. కోర్టులో కేసులు కొనసాగుతుండగానే రెవెన్యూ అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు గౌలిపుర కబేలా అక్రమ మ్యుటేషన్‌కు వ్యతిరేకంగా అఫిడవిట్‌ దాఖలు చేస్తూ వచ్చారని చెప్పారు. అయితే, నవీన్‌ మిట్టల్‌ సీసీఎల్‌ఏగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెవెన్యూ అధికారులు హైకోర్టులో భూ కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారన్నారు. 4.2ఎకరాల గౌలిపుర మున్సిపల్‌ కబేలా స్థలం జీహెచ్‌ఎంసీదే కాదంటూ అఫిడవిట్‌ దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కా డాక్యుమెంట్లతో అనేక సార్లు వివిధ కోర్టుల్లో అఫిడవిట్‌ దాఖలు చేసిన అధికారులే 2022, ఫిబ్రవరిలో మొదటిసారీ కబేలా స్థలంతో తమకేమీ సంబంధం లేదని, మమ్మల్ని కేసు నుంచి తప్పించండి అంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ పేరుతో అఫిడవిట్‌ దాఖలు చేశారని వివరించారు. ఇలా జీహెచ్‌ఎంసీ అధికారులు భిన్నంగా వ్యవహరించడంతో హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు. ఈ క్రమంలో హైకోర్టులో జీహెచ్‌ఎంసీ ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. అయినా, భూకబ్జాదారులకు అనుకూలంగా గత నెలలో తీర్పు వచ్చిందన్నారు.
కబ్జాదారులతో కొందరు అధికారులు కుమ్మక్కై భారీ భూస్కాంలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తప్పడు అఫిడవిట్‌ దాఖలు చేసిన వ్యవహారంపై విచారణ జరిపించాలని, రెవెన్యు, జీహెచ్‌ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరారు. చర్యలు తీసుకోకుంటే జీహెచ్‌ఎంసీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అరెకటిక సంఘం గౌలిపుర అధ్యక్షులు యం.యశ్వంతరావు, అరెకటిక సంఘం గౌలిపుర కార్యదర్శి ఎం.రమేష్‌, సీపీఐ(ఎం) సౌత్‌ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎల్‌.కోటయ్య, గౌలిపుర స్లాటర్‌ హౌస్‌ వర్కర్స్‌ యూనియన్‌ శివకుమార్‌ ఉన్నారు.