ద్యుతీచంద్‌కు ప్రభుత్వ సాయం నిల్‌

Government assistance to Dutichand is nil–  ప్యారిస్‌ ఒలంపిక్స్‌లో పాల్గొంటా
–  డోపింగ్‌ నుంచి బయటపడటమే నా లక్ష్యం
–  ద్యుతీచంద్‌ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : భారత పరుగుల రాణి ద్యుతీచంద్‌ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వం నుంచి కావాల్సిన సాయం కూడా అందటం లేదు. ద్యుతీచంద్‌ను గతంలో ‘కాంతి’తో పోల్చిన మోడీ.. ఆమెకు కావాల్సిన ఆర్థిక సాయం మాత్రం అందించటం లేదని క్రీడా నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ద్యుతీచంద్‌ ప్రస్తుతం డోపింగ్‌ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల నుంచి బయటపడటమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని ఆమె అన్నారు. 2024లో జరిగే ప్యారిస్‌ ఒలంపిక్స్‌ తర్వాత ద్యుతీచంద్‌ రిటైర్‌మెంట్‌కు సిద్ధమవుతున్నారు. ఈ ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించటమే లక్ష్యమని ఆమె చెప్తున్నారు.
ద్యుతీచంద్‌.. 2018 ఆగస్టులో ఆసియా క్రీడల్లో వంద మీటర్ల పరుగు పందెంలో జాతీయ రికార్డు సృష్టించి రజతం పొందింది. అయితే, 2022లో నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(నాడా).. ఆమె నిషేధిత పదార్థాలు తీసుకున్నదని నాలుగేండ్ల పాటు నిషేధం విధించింది. ఆమె ఈ నిషేధాన్ని స్విట్జర్లాండ్‌లోని లాసాన్‌లోని కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌లో సవాలు చేసి గెలవాలని యోచిస్తున్నది. ” నా జీవితం ఇలాగే ఉన్నది. నేను నా దేశానికి పతకాలు తెచ్చాను. కష్టపడి పని చేశాను” అని ద్యుతీ తెలిపింది. దేశం కోసం ఎంతో పాటుపడిన ద్యుతీకి ప్రభుత్వం సాయమందించాలని క్రీడానిపుణులు అన్నారు.