మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

– రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్‌
మధ్యాహ్న భోజన వర్కర్స్‌ సమస్యల పరిష్కరిం చడంలో ప్రభుత్వం విఫలమైందని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ అన్నారు. మధ్యాహ్న భోజన వర్కర్స్‌ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జయ శంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. మంగళవారం 7వ రోజు బతుకమ్మ ఆడి కార్మికులు నిరసన తెలిపారు. సమ్మెకు కొరిమి సుగుణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో వంటలు చేసి వండి పెడుతున్న కార్మికులకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. అప్పులు తెచ్చి వంటలు బండి పెట్టిన వర్కర్స్‌ అప్పుల పాలై దుర్భర జీవితం గడుపుతు న్నారని వివరించారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్‌ విడుదల చేస్తున్నారే తప్ప కార్మికుల అకౌంట్లో డబ్బులు వేయడం లేదని మండిపడ్డారు. గతంలో కూడా బడ్జెట్‌ రిలీజ్‌ అయిందని చెప్పి ఇప్పటివరకు వారి అకౌంట్లో డబ్బులు వేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేరళ తరహాలో మధ్యాహ్న భోజన కార్మి కులకు చెల్లించిన విధంగానే కార్మికులకు వేతనాలు చెల్లించాలని అన్నారు. వంట గ్యాస్‌, కోడిగుడ్లు సరుకులను, ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. వంటలు వండి పెడుతున్న కార్మికులకు ప్రభుత్వం ప్రమాదం జరిగిన కార్మికులకు ఇన్సూరెన్స్‌ వర్తింపజేయాలని అన్నారు. పెంచిన వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహి స్తామని హెచ్చరించారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధికార ప్రతినిధి మెరుగు రమేష్‌, వంట కార్మికులు వరలక్ష్మి, స్వర్ణలత, మల్లమ్మ, రాజేశ్వరి, భవాని, భాగ్య, రజిని, రజిత, సరస్వతి, సుగుణమ్మ, పుష్ప, పద్మ, సరోజన తదితరులు పాల్గొన్నారు.