ప్రభుత్వ కార్యాలయాలను అందంగా తీర్చిదిద్దాలి

– ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్  రెడ్డి  
నవతెలంగాణ-వీణవంక
ప్రభుత్వ కార్యాలయాలను అందంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల సముదాయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కౌశిక్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు సమస్యలతో వచ్చే ప్రజలకు ఇక్కడ ఆహ్లాదకరంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని, కార్యాలయాల్లో సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రజాప్రతినిధులకు చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారంతో మండల కేంద్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పనులు వేగవంతం చేసి ముమ్మరంగా సాగించాలని సూచించారు.
మహిళా సంఘం భవనంపై ఆరా..
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో అసంపూర్తిగా నిర్మించిన మహిళా  సమైఖ్య భవనంపై ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ఆరా తీశారు. గతంలో మంజూరైన నిధులు, అసంపూర్తికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘం భవనానికి సంబంధించి నిర్మాణం పూర్తయ్యే విధంగా చూడాలని పీఆర్ ఏఈ రాంబాబును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, సర్పంచులు నీల కుమారస్వామి, పోతుల నర్సయ్య, బండారి ముత్తయ్య, మర్రి వరలక్ష్మి స్వామి యాదవ్, బీఆర్ఎస్ నాయకులు గెల్లు మల్లయ్య యాదవ్, తాళ్లపల్లి మహేష్, యాసిన్, గొడుగు రాజు, మ్యాడగోని తిరుపతిగౌడ్, ఓరెం క్రాంతి, మోతె ఇంద్రా సేనా రెడ్డి, రెడ్డిరాజుల రవి తదితరులు పాల్గొన్నారు.