గోవాకు దేశంలోనే ప్రత్యేక స్థానం : గవర్నర్‌ తమిళిసై

నవతెలంగాణ-బంజరాహిల్స్‌
సాంస్కృతిక, పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉన్న గోవాకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన గోవా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్‌ ప్రసంగించారు. గోవా, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సారూప్యతను ఆమె ఎత్తిచూపారు. గోవాలోని అందమైన బీచ్‌లు, నిర్మలమైన సహజ ప్రదేశాలు ప్రకృతి ప్రేమికులకు అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయని చెప్పారు.
గోవా రాష్ట్ర అవతరణ వేడుకలు రాజ్‌భవన్‌లో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి వేడుకలు జరుపుకోవడం రాష్ట్రాల మధ్య సరిహద్దులను చెరిపేస్తుందన్నారు. హైదరాబాద్‌ నగరం, తెలంగాణ అభివృద్ధిలో గోవా సమాజం గణనీయమైన కృషిని గవర్నర్‌ ప్రశంసించారు.