ఎన్‌డీఎస్‌పై సర్కారు గుర్రు

Govt on NDS– సమాచారం కోసం అల్టిమేటం ఇవ్వడం సరికాదన్న ఉన్నతాధికారులు
– టెక్నికల్‌ కమిటీనా ? రాజకీయ పక్షమా ? అంటూ ఆగ్రహం
– ఎట్టకేలకు ఢిల్లీకి నివేదిక
– మరో రెండు అంశాలు పెండింగ్‌
–  విచారణ తర్వాతే అందజేత
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు సమాచారం రెండు వ్యవస్థల మధ్య ప్రచ్చన్నయుద్ధానికి దారితీసింది. రాష్ట్ర సాగునీటి శాఖ, ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) మధ్య అభిప్రాయబేధాలకు కారణమైంది. లక్ష్మిబ్యారేజీ పిల్లర్లతోపాటు ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ఎన్‌డీఎస్‌ఏ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈనెల 29లోపు సమాచారం పంపకపోతే తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేనట్టుగా భావిస్తామని లేఖలో ట్విస్ట్‌ ఇచ్చారు.
ఈ లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి రాకముందే, ఢిల్లీలో మీడియాకు చేరవేయడాన్ని తెలంగాణ సాగునీటి శాఖ తప్పుబడుతున్నది. ఇది ఇటు ప్రభుత్వాన్ని, అటు సాగునీటిశాఖను అప్రతిష్టపాల్జేసే యత్నమేనంటూ ఉన్నతాధికారులు గుర్రుమంటున్నారు. అధికారికంగా జరగాల్సిన వ్యవహారాన్ని మీడియా వరకు తీసుకెళ్లడమెందుకు ? అంటూ రాష్ట్రసాగునీటి శాఖ అధికారులు ఒకింత ఆగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం. చివరకు ఎన్‌డీఎస్‌ఏకు కావాల్సిన సమాచారమంతా ఆదివారం పంపామనీ, ఇంకొంత సమాచారం పగుళ్లపై విచారణ అనంతరమే వీలవుతుందని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. మొత్తం 20 అంశాలకుగాను డ్యామ్‌ అథారిటీ అధికారులు వచ్చిన రోజునే అప్పటికప్పుడు మూడు అంశాలకు సంబంధించి ఇచ్చేశారు. ఆ తర్వాత ఎన్‌డిఎస్‌ఏ అధికారులు ఢిల్లీ వెళ్లాక అదనపు సమాచారం కావాలంటూ మొత్తం వారు కోరిన 17 అంశాలకుగాను, ఇందులో 15 అంశాలకు చెందిన పూర్తి సమాచారం సిద్ధంచేసి పంపినట్టు సాగునీటి అధికారులు చెప్పారు. మరో రెండు అంశాలపై మాత్రం విచారణ అనంతరం మాత్రమే సాధ్యమవుతుందనీ, ఆమేరకు ఎన్‌డీఎస్‌ఏకు తెలియజేసినట్టు సాగునీటిశాఖ సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే ఎన్‌డీఎస్‌ఏ వ్యవహారంశైలి సరిగ్గా లేదని సాగునీటి శాఖ విమర్శిస్తున్నది. సమాచారం పంపాలంటే పాత రికార్డులు పరిశీలించాలి కదా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాష్ట్రంలో నిర్మాణమవుతున్నాయి, అన్నీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కదా ? ఆగమేఘాల మీద అంటే ఎలా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈనెల 23న ఎన్‌డీఎస్‌ఏ అధికారులు హైదరాబాద్‌ వచ్చారనీ, మరుసటిరోజు 24న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారని అధికారులు చెబుతున్నారు. 25న హైదరాబాద్‌లో రోజంతా సాగునీటి శాఖ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. 26న ఉదయం డ్యామ్‌ సేఫ్టీ అధికారులు ఢిల్లీ వెళ్లారని గుర్తు చేశారు. 27న సాగునీటి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ప్రాజెక్టు పగుళ్లు, ఇతర అంశాలపై సమీక్ష చేశారు. ఢిల్లీ అధికారులు అలా వెళ్లగానే ఇలా మిగతా సమారాన్ని 29లోపు పంపాలంటూ అల్లీమేటమ్‌ ఇవ్వడాన్ని రాష్ట్ర సాగునీటి శాఖ సీరియేస్‌గా తీసుకుంది. కనీసం వారం రోజులైనా గడువు ఇవ్వకుండా, ఒక్కరోజులో ఎలా పంపుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇష్టారాజ్యంగా లేఖ రాసీ, దాన్ని మీడియాకు విడుదల చేయడం మంచి పరిణామం కాదని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ స్థాయి అధికారులు అసహానం వ్యక్తం చేయడం గమనార్హం. ఇదిలావుండగా ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టారు, సమాచారం లేకుండా ఎలా ఉంటారు ? అని ఈనెల 25న జరిగిన సమావేశంలోనే డ్యామ్‌ సేఫ్టీ అధికారులు రాష్ట్ర సాగునీటి శాఖను ప్రశ్నించినట్టు తెలిసింది.