అక్టోబర్‌ 2 నుంచి మళ్లీ సమ్మెలోకి జీపీ కార్మికులు

– అప్పటిలోగా మంత్రి ఎర్రబెల్లి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
– సమ్మె డిమాండ్లు, మంత్రి హామీలపై దశలవారీగా పోరాటం: పాలడుగు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామపంచాయతీ కార్మికులకు చర్చల సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ వచ్చే నెల రెండో తేదీ నుంచి మళ్లీ జీపీ కార్మికులు సమ్మెలోకి వెళ్లబోతున్నట్టు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌ ప్రకటించారు. ఇప్పటికే సమ్మె నోటీసును పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు అందజేశామని తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 34 రోజుల సమ్మె సందర్భంగా కారోబార్‌, బిల్‌కలెక్టర్లు, గుమాస్తాలను సహాయకార్యదర్శులుగా నియమిస్తామనీ, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు, 8 గంటల సెలవు, వారాంతపు, పండుగ సెలవులు తదితర కోర్కెలను సమ్మె విరమిస్తే వెంటనే నెరవేరుస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. మల్టీపర్పస్‌ విధానం రద్దు, ఆర్థికంతో ముడిపడిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని కూడా హామీనిచ్చారని తెలిపారు. మంత్రి హామీతో సమ్మె విరమించి 45 రోజుల దాటినా ఉలుకూపలుకూ లేదని విమర్శించారు. ప్రధాన డిమాండ్లను పరిష్కరించకుండా చావుఖర్చులు, ఇన్సూరెన్స్‌ సర్క్యూలర్‌లు జారీ చేసి చేతులు దులుపుకోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మల్టీపర్పస్‌ విధానం రద్దు, పర్మినెంట్‌, వేతనాల పెంపు, మున్సిపాల్టీ సిబ్బందితో సమానంగా వేతనాలివ్వడం, రెండో పీఆర్సీ పరిధిలోకి జీపీ కార్మికులను తీసుకురావడం, కారోబార్లు, బిల్‌కలెక్టర్లు, గుమాస్తాలకు స్పెషల్‌ స్టేషన్‌ కల్పిస్తూ పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్‌ చేశారు. వీటిపై దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామనీ, అప్పటికీ ప్రభుత్వం ముందుకు రాకపోతే అక్టోబర్‌ రెండో తేదీ నుంచి తిరిగి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.