జీపీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

– కలెక్టరేట్ల ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా
– సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెలోకెళ్తామని ప్రకటన
నవతెలంగాణ- విలేకరులు
గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని, 11వ పీఆర్సీలో నిర్ణయించిన బేసిక్‌ ప్రకారం వేతనం చెల్లించాలని శనివారం కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. విధుల్లో మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని, వేతనం పెంచాలని డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో మహాప్రదర్శన నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం జేఏసీ నాయకులు అదనపు కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌ పాటిల్‌కు సమ్మె నోటీస్‌ అందజేశారు. జీపీ కార్మికులు నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేకల అభినవ్‌ స్టేడియం నుంచి ఎన్జీ కాలేజీ వరకు నిరసన మహా ప్రదర్శన నిర్వహించారు. ఈ మహా ప్రదర్శనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీ కార్మికులు వేలాదిగా తరలివచ్చారు. ప్రదర్శన ప్రారంభం సందర్భంగా జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యజ్ఞ నారాయణ, జిల్లా చైర్మెన్‌ సిహెచ్‌.లక్ష్మీనారాయణ కార్మికులనుద్దేశించి మాట్లాడారు.
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ జగత్‌సింగ్‌కు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్‌, యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్‌, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆదిలాబాద్‌ జిల్లా కార్యాలయంలో సమ్మె సన్నాహక సదస్సు నిర్వహించారు. సదస్సులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్‌ మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. 11వ పీఆర్సీని వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే జులై 6 నుంచి సమ్మెలోకి వెళ్తారని తెలిపారు.