వర్షంలోనూ జీపీ కార్మికుల సమ్మె

– పలువురి మద్దతు
– ఆసిఫాబాద్‌లో పారిశుధ్యంపై కళారూపాలతో ప్రజలకు అవగాహన
నవతెలంగాణ- విలేకరులు
గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం చేపట్టిన సమ్మెను బుధవారం వర్షంలోనూ కొనసాగించారు. వేతనాలు పెంచి తమ బతుకులు బాగు చేయాలని పాలకులకు విన్నవించారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో కళారూపాల ద్వారా పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. సమ్మెకు పలువురు నాయకులు, ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు.
నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ పట్టణంలో జీపీ కార్మికుల సమ్మెకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు దాసరి శంకర్‌తో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. నార్నూర్‌ మండలం తాడిహత్నూర్‌లో ఉపసర్పంచ్‌ విష్ణు పారిశుధ్య కార్మికుడిగా, డ్రైవర్‌గా మారారు. చెత్తను ట్రాక్టర్‌లో డంపింగ్‌ యార్డుకు తరలించారు. దహెగాం మండలంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమ్మె కొనసాగించారు. జన్నారం మండల కేంద్రంలో జీపీ కార్మికులు ఎంపీడీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ చౌక్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో పారిశుధ్యంపై కళాజాత నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.
యాదాద్రిభువనగిరి జిల్లా వలిగిగొండ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మద్దతు తెలిపారు. కార్మికులకు అనిల్‌కుమార్‌రెడ్డి రూ.50వేల సాయం అందజేశారు. ఆలేరులో పంచాయతీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల ఐలయ్య మద్దతు తెలిపి, రూ.10వేల సహాయం అందజేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు వర్షంలోనూ సమ్మె కొనసాగించారు. నల్లగొండ జిల్లా పెద్దవూరలో ఒంటికాలిపై జీపీ కార్మికులు నిరసన తెలిపారు