నవతెలంగాణ – కంటేశ్వర్
గ్రామపంచాయతీ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతిలో పనిచేస్తున్న 50 వేల మంది కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను గ్రామపంచాయతి కార్మిక జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసు, నూర్జాహన్ డిమాండ్ చేశారు. 2023 మే 25వ తేదీన గురువారం గ్రామపంచాయతి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నూర్జహాన్ దాసు వెంకట్ గౌడ్. ఎండి ఖాజా మొయినుద్దీన్. మాట్లాడుతూ..స్వచ్ఛ తెలంగాణలో అగ్రగామిగా నిలిచిన సఫాయి కార్మికులకు సెల్యూట్ కొట్టితే సరిపోదని, జీవో నెంబర్ 60 లో పేర్కొన్న విధంగా వెంటనే 19 వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా వెయ్యి రూపాయలు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన సరిపోదని, ధరలు అగ్గిలాగా భగ్గుమంటుంటే, పంచాయతి కార్మికుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెల్వదా అని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో పంచాయతి కార్మికులందరికీ వెంటనే పీఎఫ్ , ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మరణించిన కార్మిక కుటుంబానికి 10 లక్షలు, సాధారణ మరణానికి 5 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కోడ్ లను రద్దు చేయాలని. 8 గంటల పని విధానాన్ని యధా విధంగా కొనసాగించాలని, అక్రమ తొలగింపులను ఆపాలని వారు అన్నారు. 2011 జనాభా ప్రకారం 500 మందికి ఒక కార్మికుడు అనే నియమం కాకుండా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని నేటి అవసరాల ప్రకారం సిబ్బందిని నియమించాలని వారు కోరారు. జీవో నెంబర్ 51 మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, కార్మిక హక్కుల రక్షణకై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని వారు కోరారు. గ్రామపంచాయతిలో పనిచేస్తున్న కార్మికులు దళితులు నిరుపేదలు మైనార్టీలు కనుక ప్రభుత్వ పథకాలకు అర్హులు కాబట్టి వారికి డబుల్ బెడ్ రూమ్ పథకం మరియు దళితబంధు పథకాన్ని ముందుగా ఇవ్వాలని వారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోరారు. ఒక దిక్కు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016 అక్టోబర్ 26న తీర్పును ఇచ్చిన విషయం పరిగణలోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిస్టం రద్దు చేస్తామని తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి నెమరు వేసుకొని, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని లేనిచో కార్మికుల ఆందోళన తప్పదని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. “అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు– ఉరి కొయ్యలు చెరసాలలో విప్లవాన్ని ఆపలేవు” అన్నట్లుగా నిర్బంధంతో ప్రజాఉద్యమాలని ఆపాలని భ్రమిస్తే, అట్టి ప్రభుత్వాలు పతనం గాక తప్పవని వారు గుర్తు చేశారు.ప్రజలే చరిత్ర నిర్మాతలని, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళుతున్న, గ్రామపంచాయతిలో అనేక రకాల పనులు నిర్వహిస్తూ, తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టిపనిచేస్తున్న పంచాయతీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తే చరిత్ర క్షమించదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ సదస్సుకు పంచాయితీ జిల్లా కార్యదర్శి సిఐటియు జంగం గంగాధర్, ఐఎఫ్టియు భానుచందర్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సదస్సులో గ్రామపంచాయతీ జిల్లా నాయకులు సాగర్ గంగాధర్ అంజన్న లక్ష్మీ నవనీత పద్మ ఐఎఫ్టియు నాయకులు జెపి గంగాధర్, ఇందూర్ రాజయ్య, సిఐటియు మాట్లాడినారు. ఐఎఫ్టి నాయకులు సొప్పరి గంగాధర్, న్యావానంది రాజన్న, గోపి, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.