‘ఒసే బామ్మా.! యింకా ఎన్నాళ్ళే ఈ ఆస్థి పట్టుకుని వేలాడుతావు? ఈ ఇల్లేదో నా పేర రాసి కృష్ణా -రామా అనుకుని హాయిగా వుండొచ్చుగా” చూస్తే, యనభై వచ్చినా బాల్చీ తన్నడానికి బారెడు దూరంలో వుందీ బామ్మ’ అని మనసులో తిట్టుకుంటూ ఒత్తిడిచేసాడు బాలరాజు.
”ఒరే మనవడా! నా ఆస్థి కొట్టేసి నాకు సున్నం రాయలని చూడ్డమే తప్ప, మీ తాత కట్టించిన ఈ యింటికి కనీసం సున్నమైనా వేయించావా? చూస్తుంటే ఈ ఆస్థి నీ పేర ఎప్పుడు రాస్తానా అని గోతికాడ గుంటనక్కలా కాచుక్కూర్చున్నావు. అలాంటి ఆశలేం పెట్టుకోక” మాటలతోనే మనవడికి చురకలంటించింది బామ్మ.
”బామ్మా! నీకు వున్నది నేనొక్కడ్నే. ఈ ఆస్ధిపట్టుకుని ఎందుకు యింకా వేళ్ళాడతావు?”
”పోరా.. గాలివెధవ్వి.. నీకు ఆస్థి రాసివ్వడమంటే గాల్లో దీపం పెట్టినట్టే”
”బామ్మా! ఐ యామ్ హర్ట్” అంటూ మొహం చిన్నది చేసుకున్నాడు బాలరాజు.
”నువ్వు హర్టైనా ..హాయిగా ఫీలైనా.. ఆస్థి దక్కుతుందనే నమ్మకం నుండి నువ్వు రిటైర్డ్ కావలసిందే”
”ఛా.. నీ నోట్లో నోరుపెట్టడమంటే, తెలుగు రాజకీయనాయకుల నోట్లో నోరుపెట్టడమే. నాకు టైం లేదు. మా బాస్ సినిమా మొదటిరోజు మొదటి ఆటకి వెళ్ళాలి, తప్పుకో” అంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళి పోపుల డబ్బాలోని డబ్బు లాక్కుని ఆరోజే రిలీజైన సినిమా టిక్కెట్లు దొరుకుతాయోలేదో అనే ఆందోళనతో బయటకి పరుగులు పెట్టాడు.
వీధిలోకి పోతున్న మనవడ్ని చూసి ‘ఖర్మ’ అని తలపట్టుకుని ఆలోచనల్లో పడింది బామ్మ. భర్తపోయిన దు:ఖం నుండి తేరుకోకముందే కొడుకూ,కోడలూ కూడా కార్ ఏక్సిడెంట్లో దుర్మరణం పాలై, పండంటి మనవడ్ని మిగిల్చిపోయారు. ఏకైక వారసుడని గారాబం చేస్తే యిప్పుడు ఏకుమేకై కూర్చున్నాడు. సినిమా పిచ్చితో పాటు చెడు తిరుగుళ్ళకి బాగా అలవాటు పడ్డాడు. చెప్పాలంటే ఫక్తు గోదావరి జిల్లాల జులాయి! వాడబ్బలాగ చదువబ్బలేదు సరికదా, అచ్చోసిన ఆంబోతులా వీధిన పడి మరో పదిమంది పోకిరిగాళ్ళతో పోరంబోకులా తిరుగుతూ, వున్న ఆస్థిని కాస్త హారతి కర్పూరం చేసేస్తున్నాడు. మనవడి తిరుగుళ్ళకి కోనసీమలో బంగారంలాంటి ఎకరాలకెకరాల పొలం హరించుకు పోయింది. యిప్పుడు వాడి కన్ను లంకంత ఇల్లుమీద పడింది. అయితే తన భర్త సంపాదించిన ఈ యింటిని మాత్రం తాను బతికుండగా వృధాపోనివ్వకూడదన్న కృతనిశ్చయంతో వుంది. అందుకే, మనసు రాయి చేసుకుని మనవడి మీద ప్రేమని కప్పిపుచ్చుకుంటూ రోజూ మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూ నెట్టుకొస్తోంది. వాడిలో మార్పు ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా? రాదా..? అని చాలా జ్యోతిష్కులకి జాతకం చూపించి ఆరాతీస్తే, వాడి చేతి గీతల ప్రకారం పెళ్ళైన తరువాతే బాగుపడే యోగం వుందనీ, అంతవరకు ఏ ఫలితం లేదని తెలుసుకుంది. దాంతో పట్టువదలకుండా వాడికి సంబంధాలు చూస్తూ గట్టి ప్రయత్నమే చేస్తోంది. అయితే, ఎవరైనా ఏం చూసి పిల్లనిస్తారు? చుట్టుపక్కల ఊర్లలోనే కాక ఉభయగోదావరి జిల్లాల్లో వాడి పేరు ప్రఖ్యాతులు అంతలా పాకిపోయాయి మరి. బంధువర్గం ఎక్కడ పిల్లనిమ్మని అడుగుతారేమోనని తమ యింటి దరిదాపుల్లోకి రావడం మానుకున్నారు. పై పెచ్చు వాడూ పెళ్ళంటే తన తిరుగుళ్ళకి తిరుమంగళం పాడినట్టేనని పెళ్ళి చేసుకోనంటూ పట్టుబట్టాడు. అయినా మనసొప్పక వంశాన్ని కాపాడుకోవడానికి గంతకి తగ్గ బొంత కోసం తన ప్రయత్నాలు తాను చేస్తునే వుంది.
వీధి గడపలో బామ్మని చూస్తూ అటుకేసి వచ్చిన పొరుగువీధి పద్మిని- ”బామ్మా ఏంటా పరధ్యానం?” అంటూ పలకరించింది.
”ఓసే బాలరాజుని చేసుకుంటావటే?” మనవడి పెళ్ళి ధ్యాసలో వుండగా వచ్చిన ఆమె వైపు ఆశగా చూస్తూ అప్రయత్నంగా అడిగింది బామ్మ.
”ఛీ..! నాకు సిగ్గేస్తోంది. అయినా నేనొప్పుకున్నా అక్కినేని ఇప్పుడు లేడుగా?” అంది ఓణి అంచుని చేతివేళ్ళకి చుట్టుకుని పంటితో పరపరా కొరుకుతూ.
”ఛా..! నేనన్నది బాలరాజుగా నటించిన ఆ అక్కినేనిని కాదే! మా బాలరాజుని ”దీని అక్కినేని పిచ్చి పాడుగానూ, మనసులోనే తిట్టుకుంటూ అంది బామ్మ.
” ఏంటీ.. మీ బాలరాజునా?” అంటూ ఒక్క ఉదుటన వచ్చిన పని పక్కనపెట్టి మరీ పారిపోయింది పద్మిని. ఇది చూసిన బామ్మకి, ఊర్లో తన మనవడికున్న క్రేజ్ ఏ రేంజ్‌లో వుందో అర్ధమైంది. ఇలా లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని బామ్మ సుదీర్ఘంగా ఆలోచనలో పడింది. ఇంతలో-
”అన్నపూర్ణమ్మగారూ..!” అంటూ పలకరించిన వ్యక్తిని చూసి ఎవరా? అంటూ పోల్చుకునేందుకు తెగ కష్టపడింది బామ్మ.
***
వారానికొకసారైనా ఆస్థికి వారసుడ్నంటూ రాసిచ్చేయమని చేసే యుద్ధ సన్నివేశాలు విరామం లేకుండా కొనసాగిస్తున్న మనవడ్తో ఆ రోజు బామ్మ-
”ఒరే..! నేనొక నిశ్చయానికొచ్చా. ఆస్థిని రాసిచిద్దామనుకుంటున్నా”
”ఓసినీ.. ఎన్నాళ్ళకి శుభవార్త చెప్పావే? వుండు నీ నోట్లో పంచదార పోస్తా” అంటూ వంటింట్లోకి హడావిడగా వెళ్ళబోతున్న మనవడితో-
”ఆగరా.. నేనన్నది ఆస్థిని మన ఊరి రాములవారి ఆలయానికి రాసిస్తానని..” తాపీగా చెప్పింది బామ్మ.
బామ్మ చెప్పిన డైలాగ్‌లో పంచ్ లేకపోయినా, ఆమె నిర్ణయంతో పెద్ద పంచే పడింది బాలరాజుకి.
”అదేంటా మా బామ్మ బంపర్ ఆఫర్ ఇస్తోందీ అనుకున్నా? ఇదా నీ కుట్ర? ఆ పని చేస్తే ఉరేసుకుని చస్తా!”
”పోరా, ఉరి వేసుకోవడానికి మంచితాడు కొనాలన్నా డబ్బులు నన్నే అడిగే రకం, నువ్వేం చస్తావ్? నా నిర్ణయం మారదు” మనవడితో మొదటిసారిగా కటువుగా మాట్లాడింది బామ్మ.
బాలరాజు మేకపోతు గంభీరం ప్రదర్శిస్తూ- ”ఆ..! ఆస్థి నాకెలా దక్కదో అదీ చూస్తా?” అన్నాడేగానీ, అన్నంత పని ఎక్కడ చేస్తుందోనని ఓ మూల భయపడ్డాడు.
”సరే..! చివరిసారిగా నీకో అవకాశం యిస్తున్నా. ఆస్థి నీకు దక్కాలంటే, నేను చెప్పినట్టు చెయ్యి” అంది బామ్మ.
ఆస్థి త్వరగా దక్కాలంటే, బామ్మ చెప్పినట్టు చేయడం తప్ప వేరే గత్యంతరం లేక కాదనలేకపోయాడు. పైపెచ్చు ముసలదాని బుర్రలో రామాలయానికి ఆస్థి రాసివ్వాలనే కొత్త ఆలోచన దూరింది. దాంతో ఓ మెట్టు దిగి బామ్మతో సరేనన్నాడు.
”ఆ… ఇంతకీ ఏం చెయ్యాలీ?” అన్నాడు బాలరాజు.
”నువ్వు పెళ్ళి చేసుకోవాలి” మనవడి గుండెల్లో బాంబే పేల్చింది.
”పెళ్ళా..? ఆస్థి పోయినా ఫరవాలేదు, నా స్వతంత్రం మాత్రం వదులుకోను”
”ఒరే.. దేశానికి స్వతంత్రం లేకపోతే నష్టం. నీలాంటి దేశదిమ్మరికి స్వతంత్రం వుంటే నష్టం”
”అబచా..! చూస్తుంటే యిది నీ ఎత్తులా వుంది. నేనెలాగో పెళ్ళికి ఒప్పుకోను. ఆ విధంగా ఆస్థికోసం నా నోరు మూయించాలని చూస్తున్నావు”
”సరే.. అయితే, నీ యిష్టం, రేపే లాయర్ని రమ్మంటా.. ఆలయానికి ఆస్థి రాసేస్తా”
ఇప్పుడెలా..? ఈ ముసల్దేంటి ఇలాంటి మెలిక పెట్టింది? అంటూ ఆలోచనలో పడ్డాడు బాలరాజు. ఆలోచిస్తే ఓ ఉపాయం తట్టింది. అయినా తనకెవరు పిల్లనిస్తారు? తన టాలెంట్ తెలియని ఆడపిల్లల తల్లిదండ్రులు చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరూ లేరే! ఈ లైను మీదే లింకు పెడితే?
”సరే.. పెళ్ళికి ఒప్పుకుంటా. కానీ నాదీ ఓ షరతు. ఇదెలాగో పెళ్లిళ్ల సీజనే కాబట్టి నాకు పెళ్ళంటూ జరిగితే ఓ నెలలో జరిగిపోవాలి. లేకపోతే మరో మాటలేకుండా వెంటనే ఆస్థి నాపేర రాసివ్వల్సిందే! ఆ.. మరో విషయం.. పిల్ల నాకు నచ్చి తీరల్సిందే!” ఇదెలాగో ఇంత త్వరలో జరిగే పని కాదనే గట్టినమ్మకంతో ఒప్పుకున్నాడు బాలరాజు.
బామ్మ మొహం ఆనందంతో వెలిగిపోయింది.
”నీ షరతుకి ఒప్పుకుంటున్నా” ధీమాగా అంది బామ్మ.
ఆ దేవుడు తన మొర ఆలకించాడని మనసులోనే అనుకుంది.
బాలరాజు వేరేగా ఆలోచిస్తున్నాడు. తనకి పిల్లనిచ్చే ధైర్యం యిటు తమ బంధువర్గంలోకానీ, చుట్టుపక్కల ఊర్లలో కానీ ఎవ్వరూ చేయరనీ, అందునా ఓ నెలలో సంబంధం కుదిరి, పెళ్ళి పీటల వరకు వెళ్ళడం అసంభవమని నిశ్చితంగా వునాడు.
ష ష ష
”ఒరే! పెళ్ళిచూపులకి వెళ్ళాలి, రెడీగా వుండు” అంది బామ్మ, బాలరాజుతో రెండ్రోజులు తిరక్కముందే.
”చాల్లేవే.. యిప్పుడా సినిమా మన ఊరిలో ఎక్కడాడుతోంది?” కావాలంటే వి.సి.ఆర్.అద్దెకి తెచ్చి టీవీలో వేస్తా చక్కా చూసుకో అన్నాడు బాలరాజు.
”చాల్లే సంబడం.. నేనన్నది నీ పెళ్ళిచూపులు”
”ఆ..పెళ్ళిచూపులా? అందులో నాకా..? నవ్వాడు, అలా యిలా కాదు, కిందా మీదా పడి మరీ నవ్వాడు.
ఆ నవ్వుతో విసుగొచ్చిన బామ్మ-
”ఆపూ, నువ్వూ నీ నవ్వూ. ఊహించలేదు కదా? చూస్తుంటే షాక్ తిని ఏడ్వలేకా అలా నవ్వుతున్నట్టుందే”
”చాల్లే.. తెలుగులో కొత్తవాళ్ళతో తలాతోకాలేని లోబడ్జెట్ సినిమా తీసి చేతులు కాల్చుకునే వెర్రోళ్ళని చూసాకానీ వీళ్ళెవరే నాకు పిల్లనిచ్చి చేతులుకాల్చుకోవాలని చూస్తోంది? బహుశా నా గురించీ, నా టాలెంట్ గురించి పూర్తిగా తెలీదేమో. ఎందుకే నన్నంటగట్టి సాటి ఆడదానికి అన్యాయం చేస్తావ్?”
”ఎక్కువ మాట్లాడితే కాళ్ళిరగ్గొడతా. నోర్మూసుకుని మధ్యాహ్నం పెళ్ళిచూపులకి పదా. లేదంటే, రామాలయం వుండనేవుంది, ఆస్థి రాసేయడానికి”
ఈ ముక్కతో అప్పటికి బాలరాజు నోటికి, మధ్యాహ్నం యింటికి తాళం పడింది, పెళ్ళిచూపుల కోసం పై ఊరెళ్తూ.
బాలరాజు మదినిండా సందేహమే. ఇంతకీ ముసల్ది తనకి తెలీకుండా ఎక్కడ, ఎప్పుడు పట్టిందీ సంబంధాన్ని? ఆ… ఏ కన్నొంకో, కాలొంకో దిక్కుమాలిన సంబంధమై వుంటుంది. చక్కా వాళ్ళు పెట్టింది తిని, నిర్మొహమాటంగా నచ్చలేదని తప్పించుకోవచ్చనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది వేరొకటి!
అణకువకి తోడు అప్సరసలాంటి పిల్లని చూశాక బాలరాజుకి మతిపోయింది. ఆ పై అతడి ప్రమేయం లేకుండానే అప్పటికప్పుడు నిశ్చితార్థం వరకూ తతంగమంతా చకచకా నిమిషాల్లో జరిగిపోయింది. ఆ పిల్ల మనసులో పదేపదే మెదులుతుండటంతో అడ్డుచెప్పలేని బలహీనతేదో బాలరాజుని ఆవహించింది. తిరుగు ప్రయాణంలో కాస్త తేరుకున్న బాలరాజుకి సందేహాల వెల్లువ అతడ్ని స్థిమితంగా వుండనివ్వలేదు. తన గురించి బామ్మ వారి వద్ద దాచిందా? లేకపోతే అంతా తెలిసి ఎలా ఒప్పుకున్నాడా ఆడపిల్ల తండ్రీ? పిల్లలో ఏ లోపం లేదు. చూస్తే బాగా కలిగిన కుటుంబంలానే కనబడుతోంది. మరి ఏం చూసి తమ సంబంధాన్ని అంత గొప్పగా భావించి పిల్లనివ్వబోతున్నాడు? యిహ తనలో రగిలిన సందేహాగ్నిని చల్లర్చుకోదలచీ-
”బామ్మా..ఏంటే యిదంతా? ఏం మాయ చేసావ్? ఇంతకీ ఇది కలా, నిజమా? చూస్తుంటే నువ్వేదో పెద్ద స్కెచ్ వేసే వచ్చావు. అసలేం జరిగిందో నిజం కక్కు” చాలా సేపటి తరువాత మాట్లాడుతూ అన్నాడు బాలరాజు.
ఈ సారి బామ్మ పగలబడి నవ్వింది. అలా, యిలా కాదు, ఒకటే నవ్వుతోంది. చివరికి బలవంతాన నవ్వాపుకుని ఆ రోజు అనుకోకుండా వచ్చిన ఆ వ్యక్తి తనతో జరిపిన సంభాషణ గుర్తుకు తెచ్చుకుంది.
***
”అమ్మా..! మీరు అన్నపూర్ణమ్మగారే కదా? అదే.. బలరామరాజుగారి ధర్మపత్ని మీరేనా అమ్మా?
‘అవును’ అంది బామ్మ. యింతకీ అతనెవరో అనే అర్ధమొచ్చేలా వచ్చిన వ్యక్తిని చూస్తూ.
”నా పేరు వీరభద్రం” అన్నాడా వ్యక్తి. అతడ్ని ఎగాదిగా చూసింది, తనతో ఏం పనుండొచ్చాడోనని.
”మీ సందేహం అర్ధమైందమ్మా. చాలా సంవత్సరాల క్రితం ధర్మప్రభువైన బలరామరాజుగార్ని కలసి మీ పొలంలో కూలీ పని యిప్పించమన్నాను. అయితే ఆ మహానుభావుడు నా గురించి వాకబు చేసి, నేను బాగా బతికినోణ్ణనీ, చెడు సావాసంతో వున్న పదెకరాలు పొలం పోగొట్టుకుని, చివరికి రైతు కూలీగా మారదలచుకున్నానని తెలుసుకున్నాడు. ఆ రోజు ఆయనేమన్నాడో తెలుసా అమ్మా? మోతుబరివి కాకపోయిన ఒకప్పుడు అంతో యింతో పొలానికి యజమానివి, నిన్ను నా దగ్గర రైతు కూలీగా పెట్టుకోలేను. అయితే ఎంత అవసరం లేకపోతే ఈ పనిచేయడానికి సిద్ధపడ్డావో అర్ధం చేసుకోగలను. యిదిగో ఈ పాతికవేలుంచుకొని యికపైనైనా బుద్ధిగా ఏదైనా వ్యాపారం చేసుకుని పైకి రా’ అంటూ మంచి మనసుతో నన్నూ, నా కుటుంబాన్నీ సమయానికి ఆదుకున్నారమ్మా. పూలమ్మినచోట కట్టెలమ్మలేక ఆ డబ్బుతో హైద్రాబాద్ పోయి కిరాణా వ్యాపారం మొదలుపెట్టాను. కాలక్రమేణా వ్యాపారం కలిసొచ్చి కిరాణాకొట్టు కాస్త డిపార్ట్మెంట్ స్టోరుగా, ఆ తరువాత సిటీలో ఐదారు బ్రాంచీలుగా విస్తరించింది. కాస్త ఆర్థికంగా కోలుకున్న తరువాత అయ్యగార్ని కలుసుకొని కృతజ్ఞతలు తెలుపుకుందామనుకొనేలోగా బలరామరాజుగారు కాలం చేసారని తెలుసుకున్నాను. ఆ తరువాత ఎప్పటికప్పుడు మిమ్మల్ని కలవాలనుకున్నా కుదర్లేదు. వలసపోయిన తరువాత సొంతవూరుకి మొదటిసారిగా రావడం యిప్పుడేనమ్మా. అందుకే మిమ్మల్ని కలసి కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చా. అయ్యగారి సహాయాన్ని వెలకట్టలేనుకానీ, తల్లీ, అయ్యగారిచ్చిన సొమ్ము వడ్డీతో తిరిగివ్వడం నా కనీస బాధ్యత. యిందులో ఆ సొమ్ముంది పుచ్చుకోండి” అంటూ డబ్బు సంచి అందించాడు.
వీరభద్రం మాటలకి భర్త గుర్తుకొచ్చి బామ్మ కళ్ళు చమర్చాయి. సహృదయుడైన తన భర్త యిలా ఎంతమందికి సహాయం చేసాడో? వీరభద్రంలా కొందరు అప్పుడప్పుడూ వచ్చి గుర్తుచేసుకుని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళేవారూ లేకపోలేదు.
”వద్దులే వీరభద్రం! ఎప్పుడో ఆయన చేసిన సహాయాన్ని, ఈ విధంగా నువ్వు ఋణం తీర్చుకోనవసరం లేదు. ఈ సొమ్ము పుచ్చుకుంటే నా భర్త చేసిన సహాయానికి అర్ధమే లేకుండా పోతుంది”.
వీరభద్రం ఎంత ప్రాధేయపడినా బామ్మ వినలేదు.
సందిగ్ధంలో పడ్డాడు వీరభద్రం. ”ఓ విధంగా మీరు చెప్పింది నిజమే. కానీ నా ఋణం తీరేదెలా? ఊ.. ఏంచేస్తాం, ఈ సొమ్ముని పేదలకుపయోగపడే విధంగా వినియోగిస్తానమ్మా” అన్నాడు.
”మంచి మాట చెప్పావు. అలాగే చెయ్యి. ఆ.. యింతకీ మీది ఏ ఊరు? నీ కుటుంబ వివరాలేంటి?” అని మాట వరసకడిగింది బామ్మ.
”మాది ఈ ఊరికి రెండూర్లు అవతలున్న అరికిపాడు గ్రామం. నేనూ, భార్యా, యిద్దరు పిల్లలు, ఇదీ నా కుటుంబం. ఇద్దరూ ఆడపిల్లలే. పెద్దది డిగ్రీ చేసి రెండేళ్ళయింది. సంబంధాలు వెతుకుతున్నా. రెండోది ఈ సంవత్సరమే డిగ్రికొచ్చింది”
ఈ మాటలకి బామ్మ కళ్ళు మెరిసిపోయాయి. చకచక ఆలోచించింది. ఆ వెంటనే-
”వీరభద్రం.. నువ్వేం అనుకోనంటే ఒక మాట. చూస్తుంటే నీ మనసులో మా ఋణం తీర్చుకోవలనే కోరిక బలంగా వున్నట్టుంది. నేను చెప్పేది ఓ విధంగా అది తీరే మాటే!”
”చెప్పండమ్మా. ఏం చెయ్యమంటారో ఆజ్ఞాపించండి, చేసి తీరుతా” ఉత్సాహం ఆ మాటల్లో ధ్వనించింది.
”అదీ.. అదీ.. నీకభ్యంతరం లేకపోతే, మీ పెద్దమ్మాయిని నా మనవడికిస్తావా?” కొంచెం సందేహంగానే అంది బామ్మ.
ఈ మాటలకి వీరభద్రం కళ్ళలో ఆనందభాష్పాలు! ”ఏంటమ్మగారూ.. మీరు మా అమ్మాయిని మీ యింటి కోడల్ని చేసుకుంటారా? యిది నిజమేనా? వేళాకోళం కాదుగా?”
”నేనన్నది నిజమే. కాకపోతే నీ దగ్గర ఏదీ దాచను. మా మనవడి గురించి పూర్తిగా తెలుసుకో. ఆ తరువాత నిర్ణయం నీదే” అంటూ తన మనవడు ఎలాంటివాడో దాపరికం లేకుండా మొత్తం చెప్పింది బామ్మ.
”ఇదా..మీ అనుమానం? మీరేం భయపడకండి. అసలు విషయానికొస్తే పెళ్ళికాక ముందూ, ఆ తరువాత కొన్నాళ్ళు నేనూ మీ మనవడు తీరుగానే వుండేవాడ్ని. అందుకే వున్న ఆస్థి పోగొట్టుకొని మీ దగ్గర సహాయనికొచ్చింది. నా తప్పులు తెలిసీ, ఆ పెద్దాయన నాలో మార్పు వస్తుందని నమ్మి నాకారోజు ఓ అవకాశమిచ్చి సహాయం చేశాడు. యిప్పుడు మీ మనవడికి నా కూతుర్నియిచ్చి అతడు మారేందుకు నేనొక అవకాశం యివ్వకపోతే నా అంత కృతఘ్నుడు మరొకడుండడు. ముఖ్యంగా నా ధీమా ఏంటంటే, దారితప్పిన నన్ను నా యింటిది గట్టిపట్టు పట్టడంతో, నేను దారిలో పడ్డా. ఈ విషయంలో మా పెద్దమ్మాయికి అచ్చూ తల్లిపోలికే. అదే నా అసలు ధైర్యం. పెళ్ళైతే మీ మనవడు దారిలో పడతాడనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. మీరొక సారొచ్చి అమ్మాయిని చూసుకోండి చాలు” అన్నాడు ఆనందంగా వీరభద్రం.
”చాలు నాయనా.. నీ మాటల్తో నాలో కొత్త ఆశలు చిగురించాయి” ఆనందంగా అంది బామ్మ.
”చూశారా అమ్మా? మీకు కృతజ్ఞతలు చెప్పుకొని ఋణ విముక్తుడ్ని కావాలని వస్తే మళ్ళీ మీ ప్రతిపాదనతో యింకా ఋణగ్రస్థుడ్ని చేసేసారు”
”చాల్లే నాయనా.. మీ అమ్మయి మా ఇంటికి వారసుడ్ని అందిస్తే మేమే నీకు ఋణపడతాం”
”మీ కోరిక ఆ భగవంతుడు తప్పక తీరుస్తాడని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను” చెమర్చిన కళ్ళతో అన్నాడు వీరభద్రం.
ఆ తరువాత వీలుచూసుకుని బామ్మ, బాలరాజుకి తెలియకుండా రహస్యంగా వెళ్ళి వీరభద్రం కూతురుని చూసుకుని చాలా సంతృప్తి చెందింది. మనవడికి ఆ అమ్మాయి సరైన జోడీనే కాదు, దారిలోపెట్టగల నేర్పరని ఆమెతో గడిపిన ఆ ఒక్క పూటలోనే గ్రహించింది. ఆ తరువాత చకచక పెళ్ళిచూపులకి ఏర్పాట్లు చేసింది.
***
”అదిరా జరిగింది, మనవడా! మీ తాత సంపాదించిన భౌతికమైన ఆస్థి నిన్ను అడ్డదారి పట్టిస్తే, తన పరోపకారంతో సంపాదించిన పుణ్యమేరా నువ్వు దారిలో పడేందుకు ఈ రోజు అవకాశం కల్పించింది. ఏది కావాలో నువ్వే తేల్చుకో” అంది బామ్మ, మనవడితో.
ఆ తరువాత ఏం జరిగిందో చెప్పడమంటే, ఫక్తు తెలుగు సినిమాలో తరువాత సీనేంటో పండిపోయిన తెలుగు ప్రేక్షకుడికి చెప్పినట్టే!
ఎంతైనా గోదారోళ్ళు! పెళ్ళి తరువాత పబ్బం గడుపుకోవలని చూసిన మన ఫక్తు ఉభయగోదావరి జిల్లా జులాయి, తన ప్రమేయం లేకుండా గోదావరి జిల్లాల మార్క్ పెళ్ళాం చేతుల్లోకి వెళ్ళిపోయాడు. మనవడు కొంగుచాటు మొగుడయ్యాడని గ్రహించిన బామ్మ-
”మనవడా! లాయర్ని పిలవరా, ఆస్థి నీకు రాసిచ్చి బరువుదించుకుంటా” రోజుకొకసారైనా గోదారోళ్ళ సహజసిద్ధమైన వెటకారంతో అంటోంది యిప్పుడు, ఆస్థంటే ఆమడ దూరం పరిగెడుతున్న మనవడితో.
– కారంపూడి వెంకట రామదాస్