జాబ్‌మేళాకు విశేష స్పందన

 14 వేల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు 140 కంపెనీలలో 8,150 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
 విలేకరుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌. వారియర్‌
నవతెలంగాణ- ఖమ్మం
పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‌మేళాకు విశేష స్పందన లభిస్తుందని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌. వారియర్‌ అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 21 ఖమ్మం నగరంలోని ఎస్బీఐటి ఇంజనీరింగ్‌ కాలేజీలో జరిగే జాబ్‌ మేళాకు జిల్లావ్యాప్తంగా 14 వేల మంది నిరుద్యోగులు ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. విద్యార్హతలకు అనుగుణంగా 140 కంపెనీలలో 8,150 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. సుమారు 15 వేల మంది పైగా జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగార్థులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారని తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీ వరకు చదివిన వారికి కూడా ఉద్యోగ, ఉపాధి కల్పించనున్నారని తెలిపారు. ఎంపికైన వారికి రూ. 10 వేల నుంచి రూ.80 వేల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉందని, సాఫ్ట్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్నవారికి అధిక శాలరీ ఆఫర్‌ చేసేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఫార్మా, మెడికల్‌, ఐటీ కంపెనీలతో పాటు బ్యాంకింగ్‌, సర్వీసెస్‌, ఎడ్యుకేషన్‌ రంగాల్లో టెలీకాలర్స్‌ నుంచి మల్టీ నేషనల్‌ కంపెనీల వరకు ఈ జాబేమేళాలో పాల్గొనేలా ఆయా కంపెనీలను ముందుకు వచ్చాయని అన్నారు. ఇంత భారీస్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కంపెనీలు ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ముందులు రాలేదని, నిరుద్యోగ యువత తన భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత ఉద్యోగ, ఉపాధి పొందాలనే లక్ష్యంగా హౌంగార్డు ఆఫీసర్‌ నుండి పోలీస్‌ అధికారుల వరకు గ్రామీణ ప్రాంతాలలో సైతం విస్తృతంగా ప్రచారం చేస్తూ..ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని వారందరినీ అభినందించారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారే కాకుండా నేరుగా హాజరై రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలోని నిరుద్యోగ యువత అయా పోలీస్‌ స్టేషన్లలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని యువత కూడా జాబ్‌ మేళాలో పాల్గోనవచ్చని తెలిపారు. అనేక కంపెనీలు వస్తున్నందున కనీసం 10 బయోడేటా పత్రాలు తయారు చేసుకుని రాగలరని అభ్యర్థులకు మనవి చేశారు. విలేకరుల సమావేశంలో అడిషనల్‌ డీసీపీ సుభాష్‌ చంద్ర బోస్‌, ఏసీపీలు గణేష్‌, బస్వారెడ్డి, రామోజీ రమేష్‌, రహెమాన్‌, ప్రసన్న కుమార్‌, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, సిఐలు తుమ్మ గోపి, శ్రీధర్‌, సత్యనారాయణ, శ్రీహరి, స్వామి తదితరులు పాల్గొన్నారు.