– ఇంటి పెద్దకు ప్రతీఏటా రూ. 10 వేల నగదు : అశోక్ గెహ్లాట్ హామీ
జైపూర్ : రాజస్థాన్‌లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ‘గృహా లక్ష్మీ గ్యారంటీ’ను అమలు చేస్తామని, కుటుంబంలోని మహిళా పెద్దకు ప్రతీ ఏటా రూ. 10 వేల నగదు అందిస్తామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ సిలెండరును రూ.500కు ఇస్తామని అశోక్ గెహ్లాట్ వాగ్దానం చేశారు. రాష్ట్రంలోని జుంజును వద్ద బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ముఖ్యమంత్రి ఈ హామీలు ఇచ్చారు. 200 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాజస్థాన్‌లో నవంబర్ 25న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడించనున్నారు.