గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ

– దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ పెద్దవంగర: సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన వేముల సోమక్క ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దశదిన కార్యక్రమానికి గురువారం మంత్రి ఎర్రబెల్లి హాజరై, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పథకాన్ని అమలు చేస్తామన్నారు. స్లాబ్‌ ఇల్లు ఉన్న వారు, జీవో 59 కింద లబ్ధి పొందినవారు ఈ పథకానికి అనర్హులన్నారు. గృహలక్ష్మి కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారం అంటూ ఏది లేదని, తెల్లకాగితంపై రాతపూర్వకంగా దరఖాస్తు రాసి ఆహార భద్రత కార్డు, ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డుతో కలిపి తహసిల్దార్‌కు అందిస్తే వారు కలెక్టర్‌కు పంపిస్తారని చెప్పారు. గ్రామంలో ఉన్న పాత ఇల్లుకాని, స్థలాలకుకానీ దస్తావేజులు ఉండవు కాబట్టి ఇంటి నంబర్‌ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. లబ్ధిదారుల జాబితాను జిల్లా మంత్రి, కలెక్టర్‌ రూపొందిస్తారన్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన దరఖాస్తుదారులు మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామానికి ‘గృహ లక్ష్మీ’ పథకాన్ని మంజూరు చేసినందుకు, రెండో విడత గొర్రెల పంపిణీ యూనిట్లు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు, మంత్రి ఎర్రబెల్లిని సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, స్థానిక సర్పంచ్ సలిదండి మంజుల సుధాకర్, సీనియర్ నాయకులు బొమ్మెరబోయిన రాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు పోలకొండ కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ శంకర్ రావు, మండల ప్రచార కార్యదర్శులు లింగాల రమేష్, పులిగిల్ల పూర్ణచందర్, గ్రామ పార్టీ కార్యదర్శి చిలుకమార్తి సత్తయ్య, పోచారం గ్రామ పార్టీ అధ్యక్షుడు కూకట్ల వీరన్న, మండల యూత్ అధ్యక్షుడు కాసాని హరీష్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ఎర్రసాని రాంమూర్తి, యాదవ సంఘం నాయకులు నిమ్మల శ్రీనివాస్, పాలకేంద్రం చైర్మన్ రాసాల సమ్మయ్య, మండల యూత్ ఉపాధ్యక్షుడు కూకట్ల యాకన్న, మండల విద్యార్థి సెల్ ఉపాధ్యక్షుడు మంకాల దయాకర్, కేశబోయిన కేషాలు, కోట అశోక్, మంకాల మురళి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.