గ్రూప్‌-4 ప్రశాంతం

– 80 శాతం మంది అభ్యర్థుల హాజరు
– పేపర్‌-1కు 7.62 లక్షలు,పేపర్‌-2కు 7.61 లక్షల మంది
– రంగారెడ్డిలో సెల్‌ఫోన్‌తో పట్టుబడిన ఓ అభ్యర్థి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-4 పోస్టులకు శనివా రం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రాత పరీక్షలు ప్రశాంతంగా ముగి శాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్‌-4కు రాష్ట్రవ్యాప్తంగా 9,51,205 మంది అభ్యర్థులు దర ఖాస్తు చేశారని తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం 2,846 పరీక్షా కేంద్రా లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన వారిలో 9,12,380 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వివరించారు. శనివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించిన పేపర్‌-1కు 7,62,872 (80 శాతం) మంది, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2కు 7,61,198 (80 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ కోసం గతేడాది డిసెంబర్‌ ఒకటిన నోటిప ˜ికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోకపోవడంతో ఆ అభ్యర్థులను లోపలికి అనుమతిం చలేదు. దీంతో కొందరు పరీక్ష రాయలేక నిరాశతో వెనుదిరిగారు.
కఠినంగా పేపర్‌-2
గ్రూప్‌-4 ప్రశ్నాపత్రంలో పేపర్‌-1 కొంత సులువుగా, పేపర్‌-2 కఠినంగా వచ్చినట్టు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. పేపర్‌-1లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ఆర్థిక స్థితిగతులపై పలు ప్రశ్నలు వచ్చాయి. అయితే బలగం సినిమా గురించి ప్రశ్న అడగడం చర్చనీ యాంశంగా మారింది. బలగం చిత్రానికి సంబంధించి క్రింది జతలతో ఏవి సరిగ్గా ఉన్నాయో జతపరచబడినవి? అంటూ అడిగారు. ఎ. దర్శకుడు : వేణు యెల్దండి, బి. నిర్మాత : దిల్‌రాజు/హన్షితారెడ్డి/హర్షిత్‌రెడ్డి సి. సంగీత దర్శకుడు : భీమ్స్‌ సిసిరోలియో, డి. కొమరయ్య పాత్రను పోషించిన వారు : అరుసం మధుసూదన్‌ అనే ప్రశ్న అడిగి సరైన సమాధానాన్ని ఎంచుకోవాలంటూ 1. ఎ, బి, సి, డి 2. ఎ, బి మరియు డి మాత్రమే 3. ఎ మరియు బి మాత్రమే 4. ఎ, బి మరియు సి మాత్రమే అని వచ్చింది. పేపర్‌-2లో మాత్రం రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీలో సుదీర్ఘ సమయం తీసుకునే ప్రశ్నలు వచ్చాయంటూ అభ్యర్థులు వాపోతున్నారు. బ్యాంకింగ్‌, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ పరీక్షలు రాసే అభ్యర్థులకు పేపర్‌-2 ప్రశ్నాపత్రం కలిసొస్తుందన్న అభిప్రాయం వినిపిస్తున్నది.
సెల్‌ఫోన్‌తో వచ్చి పట్టుబడ్డాడు
గ్రూప్‌-4 పరీక్షకు ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌తో వచ్చి పట్టుబడ్డాడు. హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌లోని మారుతీనగర్‌ సక్సెస్‌ కళాశాలలో పరీక్షా కేంద్రానికి ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌తో వచ్చాడు. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఈ విషయాన్ని ఇన్విజిలేటర్‌ గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించి సదరు అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు. ఆ ఫోన్‌ను సీజ్‌ చేశారు. అతనిపై మాల్‌ ప్రాక్టీస్‌ కింద పోలీసులు కేసు నమో దు చేశారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సమ గ్ర విచారణ కోసం పోలీసులకు ఆ అభ్యర్థిని అప్పగించామని పేర్కొన్నారు. ఆ సంఘటన మినహా జిల్లాలో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.
15 నిమిషాల నిబంధన.. నష్టపోయిన అభ్యర్థులు
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలో గ్రూప్‌-4 పరీక్షకు శాంతినగర్‌ కాలనీకి చెందిన అభ్యర్థి రెండు నిమిషాలు ఆలస్యంగా ఉదయం 9:47 నిమిషాలకు వచ్చారు. పోలీసు లోపలికి అనుమతించలేదు. అలాగే, తాంసి మండలంలోని బండల్‌నాగపూర్‌ గ్రామానికి చెందిన అభ్యర్థి తాంసి బస్టాండ్‌ ప్రాంతంలోని రైల్వే గేటు పడటంతో ఆలస్యమైంది. పరీక్ష కేంద్రా నికి 15 నిమిషాలు ఆలస్యం కావడంతో పోలీసులు అనుమతించలేదు.
కొంప ముంచిన గూగుల్‌ మ్యాప్‌
చౌటుప్పల్‌లోని కృష్ణవేణి స్కూల్‌ సెంటర్‌ కోసం గూగుల్‌ మ్యాప్‌లో చూసుకుంటూ వచ్చిన అభ్యర్థిని పాత కృష్ణవేణి లొకేషన్‌ వద్దకు తీసుకెళ్లింది. దాంతో ఆందోళనకు గురైన వారు మళ్లీ సెంటర్‌ వద్దకు వెళ్లే సరికి నిమిషం ఆలస్యం కావడంతో అధికారులు అనుమతి నిరాకరించారు.
పరీక్ష మధ్యలో గుర్తింపు కార్డు లేదని..
చండూరు మున్సిపల్‌ కేంద్రంలోని మరియానికేతన్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో పరీక్ష రాస్తున్న నలుగురిని బయటకు పంపించారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోవడంతో అధికారులు గుర్తించి వారిని బయటకు పంపించారు.
అభ్యర్థులకు భోజనం పెట్టిన కాలనీవాసులు
ఆసిఫాబాద్‌-కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ బాలాజీనగర్‌లోని కేరళ ఉన్నత పాఠశాలలో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు కాలనీవాసులు మధ్యాహ్న భోజనం పెట్టారు. ఈ పాఠశాలలో 288 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా వీరందరికీ కాలనీవాసులు వంట చేసి భోజనం వడ్డించారు. కాలనీ వాసులకు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు.