గెస్ట్‌ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి

– సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను గౌరవించి గెస్ట్‌ లెక్చరర్స్‌ను కొనసాగిస్తూ వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో దాదాపు 1,654 మంది గెస్ట్‌ లెక్చరర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారి ఉద్యోగా లను కొనసాగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా ఇంటర్‌ విద్యాశాఖ కొత్తవారి నియామకానికి నోటిఫికేషన్‌ పంపించిందని పేర్కొన్నారు. ఈ విషయంపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ను వేశారని తెలిపారు. దాన్ని విచారించి గెస్ట్‌ లెక్చరర్లను కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించిందని గుర్తు చేశారు. ఈ ఆదేశాలను, ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్‌ 1145 ప్రకారం గెస్ట్‌ లెక్చరర్లను కొనసాగించాల్సిన అవసరముందని సూచిం చారు. విద్యా శాఖలో జూనియర్‌ లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయకపోయినా వారు విధిగా విధులను నిర్వహిస్తున్నారని తెలిపారు. పర్మినెంట్‌ ఉద్యోగాలతో సమానంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. పదేండ్ల నుంచి గెస్ట్‌ లెక్చరర్లుగా విధులు నిర్వహిస్తున్నా వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయకపోవడం అన్యాయంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం పెట్టిన మెరిట్‌ ఆధారంగా, త్రిసభ్య కమిటీ ద్వారా వారు ఎంపికయ్యారని వివరించారు. కావున వారిని యధావిధిగా కొనసాగిస్తూ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు.