– రాష్ట్రానికి రాకపోయినా ఫర్వాలేదు…పదేండ్లుగా సాయమైనా చేయరా? : శాసనమండలిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మోడీ దేశానికి ప్రధానమంత్రా..? లేక గుజరాత్ రాష్ట్రానికి మాత్రమేనా? అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యధిక వర్షపాత పర్యవసనాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై గురువారం శాసనమండలిలో లఘు చర్చను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్‌లో వరదలొస్తే ప్రధాని మోడీతో పాటు కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా అక్కడ పర్యటించారని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా వరదలొచ్చాయనీ, కానీ ఇక్కడికి మోడీ రాలేదని తెలిపారు. ప్రధాని ఇక్కడికి రాకపోయినా ఫర్వాలేదు… కానీ సాయం చేయాలని డిమాండ్ చేశారు. సాయం చేస్తే ఆదుకునే చర్యలను ఇక్కడున్న వారు చూసుకుంటారని సూచించారు. రాష్ట్ర విపత్తు సహాయ నిధిలో రూ.800 కోట్లు ఉన్నాయనీ, అందులో కేవలం 10 శాతం అంటే రూ.80 కోట్లు మాత్రమే వాడుకునే వీలుంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం పదేండ్లుగా తెలంగాణకు ఎలాంటి సాయం చేయకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయా శాఖల వారీగా వేసిన నష్టాల అంచనాలతో కూడిన నివేదికలో ఏడు శాఖలను మాత్రమే చేర్చారనీ, దానిలో వ్యవసాయ, విద్యాశాఖలను కూడా పొందుపర్చాలని సూచించారు. వరంగల్‌లో యూనివర్సిటీ ప్రక్క నుంచి డ్రెయిన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. వర్షపు నీరు వెళ్లే నాలాలపై ఆక్రమణలు ప్రపంచంలో ఎక్కడా లేవనీ, కేవలం ఆ సమస్య మన దగ్గరే ఉందని తెలిపారు. సమీప భవిష్యత్తులో కుంభవృష్టిలు తగ్గే అకాశాలు కనిపించడం లేదని చెప్పారు. హైదరాబాద్‌లో వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాలు ఏర్పాటు చేయాలనీ, అవసరమైతే ప్రయివేటు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఖమ్మం మున్నేరు వాగుకు యుద్ధ ప్రాతిపదికన కరకట్టలు నిర్మించాలని కోరారు. మొరంచపల్లి గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలవరం పూర్తయితే భద్రాచలానికి ఇంకా కష్టాలు పెరుగుతాయనీ, అక్కడ కరకట్టలు నిర్మించడమా? లేక లోతట్టు ప్రాంతాల వారిని ఎత్తైన ప్రాంతాలకు మార్చడమా? ఏది తక్కువ ఖర్చుతో కూడుకున్నది? తదితర విషయాలను పరిశీలించాలని కోరారు. కరకట్టల నిర్మాణానికి భూసేకరణ కష్టమని నర్సిరెడ్డి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. భారీ వర్షాలతో ఉద్యోగులు కూడా కొంత మేరకు నష్టపోయారనీ, వారి పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తే సాయం చేసినట్టవుతుందని సూచించారు.