గుజరాత్‌ మోడల్‌ తుస్సు…

– 38 శాతం మందికి పోషకాహార లోపం
– గృహవసతికి దూరంగా 23 శాతం మంది
– నిటి ఆయోగ్‌ నివేదిక వెల్లడి
– ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ కంటే దారుణం
న్యూఢిల్లీ : బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకునే గుజరాత్‌ మోడల్‌ బుడగ మరోసారి పేలిపోయింది. ఎంతో అభివృద్ధి చెందిందని, పేదల సంఖ్య భారీగా తగ్గిందని కాషాయ దళాలు ఎంతో ఆర్భాట ప్రచారపటాటోపం చేసే గుజరాత్‌లో రాష్ట్ర జనాభాలో 38 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, పోషకాహార రంగంలో గుజరాత్‌ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని నీతి ఆయోగ్‌ నివేదిక స్పష్టం చేసింది.
ఈ ఏడాది జులైలో నిటి ఆయోగ్‌ విడుదల చేసిన జాతీయ బహుముఖ పేదరిక సూచిక (ఎంపీఐ) నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని జనాభాలో 38.09 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గుజరాత్‌ గ్రామీణ జనాభాలో దాదాపు సగం మంది (44.45 శాతం), పట్టణ ప్రాంతాల్లో 28.97 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. నిటి ఆయోగ్‌ నివేదిక ప్రకారం.. వెనుకబడిన రాష్ట్రాలుగా భావించే ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు పౌష్టికాహార రంగంలో గుజరాత్‌ కంటే మెరుగ్గా ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) 5 డేటా ప్రకారం ఎదుగుదల లేని పిల్లల విషయంలో గుజరాత్‌ నాల్గవ స్థానంలో ఉంది. రాష్ట్రంలోని 39 శాతం మంది పిల్లలు తమ వయసుకు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉన్నారు.
ఇంకా, బలహీన (చైల్డ్‌ వేస్టింగ్‌), వయసుకంటే తక్కువ బరువు ఉన్న పిల్లల విషయంలో గుజరాత్‌ 25.1 శాతం, 39.7 శాతంతో రెండవ స్థానంలో ఉంది. ఆరోగ్య ప్రమాణాల పరంగా గుజరాత్‌ రాష్ట్రం యొక్క పేలవమైన పనితీరును ఇది ప్రదర్శిస్తుంది. (చైల్డ్‌ వేస్టింగ్‌ అనేది పిల్లలు తమ పొడవు కంటే చాలా సన్నగా, బలహీనంగా ఉండడాన్ని సూచిస్తుంది. ఇటీవలి కాలంలో వేగంగా బరువు తగ్గడం లేదా బరువు పెరగడంతో ఇది సంభవిస్తుంది. చైల్డ్‌ వేస్టింగ్‌తో మరణాలు సంభవించే ప్రమాదం కూడా ఉంది, కానీ చికిత్సతో దీనిని నివారణ సాధ్యమే).
నిటి ఆయోగ్‌ నివేదిక ప్రకారం గుజరాత్‌లో 23.30 శాతం జనాభాకు గృహ వసతి లేదు. ఈ విషయంలో గుజరాత్‌ కంటే కేరళ, పంజాబ్‌, తమిళనాడు మెరుగ్గా ఉన్నాయి. గుజరాత్‌ గ్రామీణ జనాభాలో 35.52 శాతం మంది గృహనిర్మాణానికి దూరంగా ఉన్నారని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని నివేదిక తెలిపింది.
పేదరికం విషయానికి వస్తే, గుజరాత్‌లో బహుముఖ పేదల సంఖ్య ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వేల ప్రకారం 2015-16లో 18.47 శాతం ఉండగా 2019-21లో 11.66 శాతంగా ఉంది. గుజరాత్‌ కంటే మహారాష్ట్ర (7.81 శాతం ), ఆంధ్రప్రదేశ్‌ (6.06 శాతం), పంజాబ్‌ (4.75 శాతం), తమిళనాడు (2.20 శాతం), కేరళ (0.55 శాతం), కర్నాటక (7.58 శాతం) కంటే మెరుగైన పనితీరు కనబరిచాయి.
గుజరాత్‌లోని దాహోద్‌ల అత్యధిక పేదరికం నిష్పత్తి 38.27 శాతం ఉండగా, మరోసారిలో అత్యల్పంగా 4.84 శాతం నమోదైంది. బహుముఖ పేదల సంఖ్య గుజరాత్‌లో వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉండటంతో పాటు, పట్టణ ప్రాంతాలు అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌ల్లో కేంద్రీకృతమైందని నివేదిక తెలిపింది. హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌ కంటే గుజరాత్‌లో బహుముఖ పేదల సంఖ్య ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. అలాగే ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్‌లో పేదలు పేదలు గానే మిగిలిపోతున్నారని నిటి ఆయోగ్‌ నివేదిక సూచిస్తుంది.