గురుకుల పీఈటీలకు వెంటనే పోస్టింగ్‌లివ్వాలి

– టీఎస్‌పీఎస్సీ ముందు అభ్యర్థుల నిరసన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ప్రకటించిన పీఈటీ పోస్టులకు తుదిజాబితాను వెంటనే ప్రకటించి పోస్టింగ్‌లు ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యాలయం ముందు వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 1:1 జాబితాను ప్రకటించాలని కోరారు. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీ కోసం 2017లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అదే ఏడాది సెప్టెంబర్‌లో పరీక్ష రాస్తే 2018, మార్చిలో ఫలితాలను విడుదల చేసిందని చెప్పారు. ఆ ఏడాది మేలో 1:2 నిష్పత్తి ప్రకారం టీఎస్‌పీఎస్సీ ఎంపిక జాబితా ప్రకటించిందని అన్నారు. ఆరేండ్లయినా తుదిజాబితాను ప్రకటించడం లేదని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ ఇంకా కాలయాపన చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. 616 కుటుంబాల్లో వెలుగులు ప్రసాదించాలని విజ్ఞప్తి చేశారు.