గురుకుల అభ్యర్థులు

– ఒకే జిల్లాలో పరీక్ష రాయాలి
– డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గురుకుల బోర్డు ఆధ్వర్యంలో వచ్చేనెల ఒకటి నుంచి 23 వరకు నిర్వహించే రాతపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒకే జిల్లాలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో గురుకుల పోస్టుల పరీక్షలను నిర్వహిస్తున్న తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆన్‌లైన్‌లో హల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. దీంతో అభ్యర్థులకు ఒక్కో పరీక్ష ఒక్కో జిల్లాలో పరీక్షా కేంద్రాలను కేటాయిం చడంతో వారు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. చాలా మంది అభ్యర్థులకు మూడు పరీక్షలను మూడు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో వారు అయోమయానికి లోనవుతున్నారని తెలిపారు. చాలా మంది అభ్యర్థులు నష్టపోతారని పేర్కొన్నారు. ఒకే జిల్లాలో పరీక్షా కేంద్రాలను కేటాయించాలని కోరారు. ఒక పరీక్షకు, మరో పరీక్షకు రెండు, మూడు రోజుల వ్యవధి ఉండాలని సూచించారు.
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు : పీవైఎల్‌
గురుకులాల్లో జేఎల్‌, డీఎల్‌, టీజీటీ, పీజీటీ, లైబ్రేరియన్‌ ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ కోసం కేంద్రాల కేటాయింపు చూస్తుంటే నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నట్టు ఉందని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్‌) విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె కాశీనాధ్‌, కెఎస్‌ ప్రదీప్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష కేంద్రాలు ఒక్కో పరీక్షకు ఒక్కో కేంద్రంలో పెట్టి, అభ్యర్థులకు పరుగు పందెం పెట్టినట్టుందని పేర్కొన్నారు. పరీక్ష రాసే వారిలో వికలాంగులు, గర్భిణులు, బాలింతలు, సైతం ఉంటారని తెలిసి కూడా ఇలా కేంద్రాలు కేటాయించడం సరైంది కాదని విమర్శించారు. ఈ సమస్యను గురుకుల బోర్డ్‌ కన్వీనర్‌ మల్లయ్య బట్టుకి గతనెల 30నే తాము వినతి పత్రం ఇచ్చామని గుర్తు చేశారు. అయినా పరిగణనలోకి తీసుకోకపోవడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని తెలిపారు. ఇలా కేంద్రాలు వేసి, అభ్యర్థులు కోర్టుకి వెళ్లేలా చేసి, పరీక్షలు జరగకుండా చేసేలా చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. తక్షణమే రోజుకి రెండు విడతల్లో పరీక్షలను జిల్లా కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.